వైసీపీ కొత్త ప్లాన్...

Update: 2018-09-04 04:17 GMT

ఇంటింటికీ వైసీపీ కార్యక్రమానికి ఆ పార్టీ సిద్ధమవుతోంది. 100 రోజులపాటు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఆయా నియోజకవర్గాల్లోని నేతలు వెళ్లేలా దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ అధినేత జగన్. విశాఖలో జరగనున్న ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమావేశంలో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగన్ పిలుపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత వై.ఎస్.జగన్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్‌చార్జిలు, కోఆర్డినేటర్లతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకునేలా పార్టీ నేతలను ఆదేశించనున్నారు. అలాగే, చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించనున్నారు జగన్. 

ఈ నెల 9 నాటికి జగన్ పాదయాత్ర విశాఖ సిటీకి చేరనుండటంతో అదేరోజు సాయంత్రం భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది వైసీపీ. 10వ తేదీన పార్టీ నేతలతో సమావేశం కానున్న జగన్ ఇంటింటికి వైసీపీ కార్యక్రమంపై దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. గతేడాది గడప గడపకూ వైసీపీ, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ ఈ ఏడాది డిసెంబరులోగా ఇంటింటికి కార్యక్రమం ద్వారా టీడీపీ హామీలను ఎండగడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తోంది. మరోవైపు అన్ని జిల్లాల క్షేత్రస్థాయి బూత్ లెవెల్ కమిటీలతో కూడా సమావేశం నిర్వహించి ఎన్నికల అజెండాలో ప్రధానమైన నవరత్నాలపై విస్తృత ప్రచారం చేయాలని భావిస్తోంది వైసీపీ. 

Similar News