అప్పుడేనా.. ఇదేంటి ఇలా జరుగుతోంది..

Update: 2018-06-27 14:30 GMT

బడ్జెట్ విషయమై అదికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జులై5న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని కర్ణాటక సీఎం కుమారస్వామి ఇటీవల ప్రకటించారు. దీనికోసం అధికారులతో చర్చలు జరుపుతున్నారు. నివేదికలు తెప్పించుకుంటున్నారు. అయితే దీనిపై మాజీ సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. ఎన్నికలు జరగడానికి ముందు ఫిబ్రవరిలోనే పూర్తిస్థాయి పద్దులు పెట్టామని.. వాటిని అమలు చేస్తే చాలన్నారు. మళ్లీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఏముందని సిద్దరామయ్య ప్రశ్నించారు. అంతగా కొత్త పథకాలు అమలు చేయాలనుకుంటే సప్లమెంటరీ బడ్జెట్ పెడితే సరిపోతుందన్నారు. ఇది సీఎం కుమారస్వామి ఆగ్రహానికి కారణమైంది. తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ పై సిద్దరామయ్య సలహాలు అవసరం లేదంటూ ఎదురుదాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో తాము రైతులకు రుణమాఫీ వంటి హమీలు ఇచ్చామని.. వాటిని అమలు చేయాలంటే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టితీరాలన్నారు. పైగా గత బడ్జెట్ సమయంలో ఉన్న సభ్యులలో సగం మంది ఇప్పుడున్న సభలో లేరన్నారు.. కొత్తగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల అభీష్టం మేరకు సలహాలు, సూచనలు తీసుకుని వారి ఆమోదంతో బడ్జెట్ పెట్టాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దీనిపై ఎవరు అభ్యంతరాలు చెప్పినా పట్టించుకోమని కుమారస్వామి తెగేసిచెప్పారు. దీంతో రెండు పార్టీల్లో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలావుంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకమునుపే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య కీచులాటలు మొదలయ్యాయి. ఇక ఆసాంతం వారు ఏమాత్రం కలిసుంటారో నమ్మకమైతే లేదని ఎద్దేవా చేస్తున్నారు బీజేపీ నేతలు.

Similar News