ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన దినకరన్‌

Update: 2017-12-24 11:46 GMT

తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కనున్నాయ్‌. అమ్మ జయలలిత మృతితో ఆర్కేనగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి దినకరన్‌ తిరుగులేని విజయాన్ని సాధించాడు. కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఎండ్‌ వరకు ప్రతి రౌండ్‌లోనూ దినకరన్‌ ఆధిక్యం సాధించి తనకు తిరుగులేదని చాటి చెప్పాడు. ఆర్కే నగర్‌లో గెలిచి దినకరన్‌కు బుద్ధి చెప్పాలనుకున్న అన్నాడీఎంకే ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఈ గెలుపుతో జయలలితకు అసలైన వారసుడు తానేనని దినకరన్‌ నిరూపించుకున్నాడు. అధికార పార్టీ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోకపోవడం అటుంచితే కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మొత్తం 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 86,472 ఓట్లతో స్పష్టమైన మెజార్టీ లభించింది. అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌ 47,115 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. డీఎంకే అభ్యర్థి మురుదు గణేష్‌ 24,075 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.18 రౌండ్‌ పూర్తయ్యేసరికి దినకరన్‌ ఓట్లను గమనిస్తే.. ఆయన సమీప ప్రత్యర్థి కంటే దాదాపు రెట్టింపు ఓట్లతో ముందున్నారు. గతంలో జయలలిత సాధించిన మెజార్టీకి చేరువలో ఉన్నారు. మరో రౌండ్‌ లెక్కింపు జరగాల్సి ఉంది. ఇప్పటికే విజయం ఖరారు కావడంతో శశికళ వర్గం సంబరాల్లో మునిగి తేలుతోంది. విజయాన్ని పురస్కరించుకుని అమ్మ సమాధి వద్ద దినకరన్‌ నివాళులర్పించారు. ఆర్కేనగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News