సభ్యత్వం రద్దు.. ఎవరికి సెల్ఫ్ గోల్?

Update: 2018-03-16 06:09 GMT

తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గొడవలో.. తప్పెవరిది? తప్పు చేసినట్టుగా టీఆర్ఎస్ చెబుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ దా? లేదంటే.. వారి సభ్యత్వం రద్దు చేయించిన ప్రభుత్వానిదా? రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయంగా బలంగా ఉన్న అధికార, ప్రతిపక్షాలు రెండూ.. ఈ విషయంలో వ్యవహరించిన తీరును.. ప్రజలు మాత్రం హర్షించలేకపోతున్నారు.

ఈ విషయంలో ఏ పక్షం కూడా సంయమనంతో వ్యవహరించలేదని.. చాన్స్ దొరకగానే వేటేసి అధికార పక్షం ఆనందిస్తే.. ఆ వెంటనే కాంగ్రెస్ నేతలు దీక్షల పేరుతో అనవసర సవాళ్లు విసురుకుంటూ తమను పట్టించుకోవడమే మానేశారని జనాలు ఆఫ్ ద రికార్డ్ గా అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం కూడా లేదు. ఊహాగానాల ఆధారంగా.. కనీసం మూడు నెలల ముందే ఎన్నికలు జరగొచ్చని తెలుస్తోంది.

ఇలాంటి సందర్భంలో.. అధికార, విపక్షాలు ప్రవర్తించాల్సింది ఇలాగేనా అన్న చర్చ జనాల్లో జరుగుతోంది. ఎవరూ సంయమనంతో ఉండకపోవడం.. రెండు పక్షాలకూ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదలు.. కాంగ్రెస్ నేతలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసి ఉంటే.. వారికే హుందాగా ఉండేది. కానీ.. అనవసర గొడవతో విషయాన్ని ఇంత వరకూ తెచ్చేందుకు కారకులయ్యారు.

తర్వాత.. ప్రభుత్వం కూడా గొడవకు కాంగ్రెస్ నేతలను బాధ్యులను చేసింది కానీ.. సరైన ఆధారాలు చూపించకుండానే.. ఎవరితో సంప్రదింపులు కూడా చేయకుండానే.. ఇద్దరి సభ్యత్వాన్ని రద్దు చేయించిందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో.. అధికార, విపక్షాల తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్న విషయం అయితే స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ అసంతృప్తిని పార్టీలు, నేతలు ఎలా చల్లారుస్తారన్నదే.. ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

Similar News