రిజర్వేషన్ల పంచాయతీ... బీసీల ఛాంపియన్ ఎవరు?

Update: 2018-12-21 08:35 GMT

తెలంగాణ పంచాయతీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లను ఓటర్ల జాబితాలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది. ఈ నెల 29 లోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. జనవరి 10 లోపు తెలంగాణ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హై కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ప్రధానమైన రిజర్వేషన్ల ఏ విధంగా ఖరారు చేయాలన్న దానిపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.  

పంచాయతీల్లో  బీసీలకు 23.81%, ఎస్సీలకు 20.46%, ఎస్టీలకు 5.73% చొప్పున రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. బీసీ రిజర్వేషన్లను ఓటర్ల జాబితాలకు అనుగుణంగా నిర్ధారిస్తారు. అన్ని కేటగిరిల్లోనూ మహిళలకు 50 శాతం స్థానాలను కేటాయిస్తారు. నాన్‌–షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో సర్పంచ్‌ల విషయంలో మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటారు. వార్డు సభ్యులకు సంబంధించి గ్రామపంచాయతీలను యూనిట్‌గా తీసుకుంటారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని గ్రామపంచాయతీలను, 100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామపంచాయతీలను మినహాయించి రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. 

100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామపంచాయతీల్లో అన్ని సర్పంచ్‌ స్థానాలను ఎస్టీలకేకేటాయిస్తారు. అన్ని వార్డులను ఎస్టీలతోనే భర్తీ చేస్తారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని అన్ని సర్పంచ్‌ స్థానాలను ఎస్టీలకే కేటాయిస్తారు వార్డు సభ్యుల విషయంలో సంబంధిత గ్రామపంచాయతీల్లోని వివిధ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయిస్తారు.

2018 రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం బీసీ సర్పంచ్‌ స్థానాలు ఖరారు చేసి ఒక్కో జిల్లాకు కేటాయిస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వ్‌ చేసిన స్థానాల్లో 50 శాతం ఆయా వర్గాలకు చెందిన మహిళలకు కేటాయిస్తారు. పంచాయతీల్లోని వార్డులను డ్రా ద్వారా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీల్లోని మహిళలకు రిజర్వ్‌ చేస్తారు. పంచాయతీల్లో రిజర్వేషన్లపై మరింత స్పష్టత కోసం  జిల్లా పంచాయతీ అధికారులతో  పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఇవాళ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 29 నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. 

Similar News