ఆ నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆయనకేనా..?

Update: 2018-06-25 13:31 GMT

పదేల్లపాటు ప్రతిపక్షంలో ఉండి.. గడిచిన ఎన్నికల్లో  అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది టీడీపీ. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉన్నా ప్రకాశం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో మాత్రం ఆసక్తికరంగా మారింది. పశ్చిమ ప్రాంతానికి కేంద్ర బిందువుగా చెప్పుకునే మార్కాపురంలో ఆ పార్టీ  వర్గపోరుతో సతమతమవుతుందా..?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మార్కాపురం నియోజకవర్గం నుంచి ఓ పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికైన కందుల నారాయణరెడ్డి ప్రస్తుతం టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జంకే వెంకట రెడ్డి చేతిలో అయన ఓటమిచెందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నాయకులు కొందరు కందులకు సరైన మద్దతు తెలపలేదనే నానుడి ఉంది. టీడీపీ నేత, ఆపార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి ఇమ్మడి కాశీనాధ్ , కందులకు మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. 

ఒకానొక దశలో కాశీనాధ్ టికెట్ రేసులోకి వచ్చారు. ఈ పరిణామం కందులకు రుచించలేదు. దాంతో కందుల పార్టీపై అలకబూనారు. తనను కాదని కాశీనాధ్ ను ప్రోత్సహిస్తున్నారన్న కారణంగా అప్పట్లో అయన వైసీపీలో చేరుతారన్న  వాదన బలంగా వినపడింది. అయితే  అనూహ్యంగా టికెట్ కందులకే దక్కడం, అయన ఓటమి చెందడం జరిగిపోయాయి.. ఆ ఎన్నికల్లో కాశీనాధ్ వర్గం జంకే వెంకటరెడ్డికి లోలోపల సపోర్ట్ చేసిందనే విషయంపై అప్పట్లో చర్చ  జరిగింది. కాశీనాధ్ కు కొన్ని ఊళ్లలో మంచి పట్టు ఉంది. కొత్తపల్లి, అమ్మవారిపల్లి తోపాటు మార్కాపురంలోని మూడు వార్డులలో ఇమ్మడి కాశీనాధ్.. ఓటర్లను ప్రభావితం చెయ్యగలరు. అంతేకాకుండా ఇతర మండలాల్లో కూడా ఆయనకు మద్దతిచ్చే కార్యకర్తల సంఖ్య ఘనంగానే ఉంది. కానీ మాజీ శాసనసభ్యుడిగా ఉన్న నారాయణరెడ్డిని ఢీకొట్టే సత్తా మాత్రం ఆయనకు లేదంటున్నారు. 

ఇదిలావుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఈ ఇద్దరు నేతలు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని కాశీనాధ్ ఇటీవల మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పైగా అయన బీసీ కార్డును కూడా ప్రయోగిస్తున్నారు. జిల్లాలో బీసీ సామజికవర్గానికి అవకాశం కల్పించలేదని.. ఈసారి తనకు టికెట్ ఇస్తే ఆ లోటు తీరుతుందని అధిష్టానానికి సూచించినట్టు సమాచారం.  మరోవైపు కందుల కూడా నియోజకవర్గంలో  కార్యకర్తల బలం తనకే ఉందని.. తద్వారా ఈసారి కూడా తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కానీ సింహభాగం కందుల వైపే అధిష్టానం  మొగ్గుచూపే అవకాశమున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందరూ ఊహించినట్టు కందుల నారాయణరెడ్డికే టికెట్ ఇస్తే కాశీనాధ్ వర్గం ఏ మేరకు  కందులకు సపోర్ట్ చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. అదేక్రమంలో బీసీ వైపు మొగ్గు చూపితే కాశీనాధ్ కు దక్కే ఛాన్స్ ఉంది కానీ.. కందుల..కాశీనాధ్ కు సపోర్ట్ చేస్తారా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న

Similar News