ఖమ్మంపై పట్టుకు కేసీఆర్ యత్నం...సండ్రకు తొలి విడతలోనే మంత్రి పదవి ?

Update: 2018-12-24 04:08 GMT

సత్తుపల్లి నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కారెక్కుతారనే వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో ఆయనకు తొలి విడతలోనే మంత్రివర్గంలో చోటు దక్కనుందని తెలుస్తున్నది. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా సమ్మతించినట్టు సమాచారం. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వారికి తొలి విడతలోను ఫిరాయింపుల ద్వారా వచ్చిన వారికి మలి విడతలోనూ మంత్రి పదవులివ్వాలని సీఎం భావించారు. కానీ ఇందుకు సండ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది.  
`
ఈనెల 20న సండ్ర కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తనకు తొలి విడతలోనే బెర్తు ఖాయం చేయాలంటూ సీఎంను ఆయన కోరారు. మొదటి విడతలో మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గ అభివృద్ది కోసమని చెప్పుకునే వీలుంటుందని సండ్ర సీఎంకు వివరించారు. ఇందుకు కేసీఆర్ అంగీకరించారని తెలిసింది. 

ఇదే సమయంలో ఒకే దెబ్బకు రెండు కాదు మూడు పిట్టల్ని కొట్టొచ్చని సీఎం భావిస్తున్నారు. వీటిలో ఒకటి ఖమ్మం జిల్లాలో పార్టీ పట్టును పెంచుకోవటం, రెండు మాజీ మంత్రి తుమ్మలకు చెక్‌ పెట్టటం, మూడు ఎంపీ పొంగులేటిని దెబ్బకొట్టటం. జిల్లాలో పార్టీ ఓడిపోవటానికి నాయకుల మధ్యనున్న అంతర్గత కుమ్ములాటలేనన్న విషయాన్ని కేసీఆర్‌ ధృవీకరించుకున్నారు. అందువల్ల సండ్రకు మంత్రి పదవినివ్వటం ద్వారా ఇటు తుమ్మలకు, అటు పొంగులేటికి హెచ్చరికలు జారీ చేసినట్టు అవుతుందని ఆయన భావిస్తున్నారు.  

మరోవైపు తొలి విడత మంత్రివర్గ ప్రమాణం అనంతరం కేసీఆర్‌ మొదటి అధికారిక పర్యటన ఖమ్మం జిల్లాలోనే ఉండబోతున్నది. అక్కడి కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘ సమావేశం నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా జిల్లాకు అనేక హామీలు గుప్పించనున్నారు. ఇదే అదనుగా పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ పార్టీ శ్రేణులకు దిశా, నిర్దేశం చేయనున్నారు.

Similar News