మంగళవారం దొంగలు...దొంగతనానికి మంగళవారమే మంచిరోజట..

Update: 2018-10-23 07:54 GMT

సాధారణంగా శుభకార్యాలకు వారం, వర్జ్యం, తిథులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. కానీ పోలీసులకు చిక్కిన దొంగలు మాత్రం కాస్త డిఫెరెంట్. దొంగతనం కూడా ఓ శుభకార్యమే కాబట్టి ఓ ఘరానా దొంగ దోపిడీలకు మంగళవారాన్ని ఫిక్స్ చేసుకున్నాడు.  ఈ విచిత్ర దొంగలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మంగళవారం దొంగతనాల వెనుక పెద్ద మ్యాటరే ఉందట ఇంతకు ముందు అన్ని రోజుల్లో దొంగతనం చేయడం వల్ల పోలీసులకు ఇట్టే చిక్కిపోయేవారట. పైగా కలెక్షన్‌ కూడా నిల్‌గా ఉండటంతో విసుగు చెందిన దొంగ సెంటిమెంట్‌గా మంగళవారాన్ని ఎంచుకున్నాడు. ఆ రోజు తప్ప మరో రోజు దొంగతనం చేయకూడదని ఒట్టుపెట్టుకున్నాడు. అది కాస్త బాగా కలిసిరావడంతో ఇక చెలరేగిపోయాడు. పక్కాగా స్కెచ్‌వేసి పట్టపగలే అటు ప్రజలకు ఇటు పోలీసులకు చుక్కలు చూపించాడు. 

మంగళవారం దొంగగా మారిన అతగాడి అసలు పేరు మొహమ్మద్ సమీర్ ఖాన్ . బార్కస్‌కు చెందిన సమీర్ ఖాన్ అలియాస్ సమీర్ పఠాన్ అలియాస్ షోయబ్ సీడీలు, వస్త్రాల వ్యాపారం చేసేవాడు. 2008లో సెల్‌ఫోన్ చోరీ కేసులో అరెస్టయ్యాడు. ఇక అప్పటి నుంచి దొంగగా మారాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసే సమీర్‌పై 30కిపైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా జైలులో పరిచయమైన ఓల్డ్ మలక్‌పేటకు చెందిన షోయబ్‌ను అనుచరుడిగా మార్చుకున్న సమీర్ కలిసి దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టారు.

పగటి పూట ఇద్దరూ కలిసి బైక్‌పై తిరుగుతూ దొంగతనానికి అనువైన ఇంటిని ఎంచుకుంటారు. దొంగతనం చేయాల్సిన ఇంటిని ఎంచుకున్నా మంగళవారం వరకు ఆగుతారు. ఆ తర్వాత పగటి పూట మాత్రమే ఇంట్లోకి చొరబడి పదినిమిషాల్లో పనికానిచ్చేస్తారు. మంగళవారం కాకుండా ఇతర రోజుల్లో దొంగతనానికి వెళ్తే ఆ ఇంట్లో ఏమీ దొరకకపోవడమో, పోలీసులకు దొరికిపోవడమో జరగడంతో ఆ డే నే ఫిక్స్‌ చేసుకుని విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. 

ఈ దొంగల బ్యాచ్‌కు కంటిచూపు లోపం ఉండటంతో పగలు మాత్రమే దొంగతనాలు చేస్తారట. పోలీసులకు చిక్కకుండా హెల్మెట్ ధరించడం, సిమ్‌కార్డులు మార్చడం వంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. వీరిపై నిఘాపెట్టిన పోలీసులు తాజాగా సమీర్, అతడి సహాయకుడు షోయబ్‌ను పట్టుకున్నారు. వారి నుంచి  నుంచి 21 లక్షల విలువచేసే 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Similar News