తమ్ముడి వేధింపులు.. సహజీవనం చేస్తున్న జంట ఆత్మహత్యాయత్నం

Update: 2018-04-05 08:18 GMT

సహజీవనం చేస్తున్న ఓ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని గోదావరి నదిలో బుధవారం జరిగింది. వారిలో పురుషుడు మృతిచెందగా, మహిళ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన జంగా హరినాథ్‌(48) భార్య చనిపోయింది. దీంతో అతను మల్హర్‌ మండలం కొయ్యూర్‌కు చెందిన శ్యామలకు దగ్గరయ్యాడు. మూడేళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొంతకాలంగా వీరిద్దరి సహజీవనం సాఫీగానే సాగింది. కానీ అక్క వ్యవహారం నచ్చని ఆమె చిన్న సోదరుడు పండ్ల రాములు పలుమార్లు వారితో గొడవకు దిగాడు. ఇంటికొచ్చి దాడికి కూడా పాల్పడ్డాడు. అయినా సరే, హరినాథ్ – శ్యామల కలిసే ఉంటున్నారు.

రాములు వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. అతని వేధింపులు భరించలేక బుధవారం ఉదయం 7.30గం. సమయంలో ఆ జంట ఆత్మహత్యకు యత్నించింది. కాళేశ్వరంలోని గోదావరి నదిలోని వీఐపీ ఘాట్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హరినాథ్‌ అక్కడికక్కడే మృతిచెందగా, శ్యామల అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వారిని గమనించిన కొందరు వెంటనే వారిని 108లో  మహదేవ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు.‘మిమ్మల్ని నేనే చంపాలా.. మీరే చస్తారా’ అని రాజు బెదిరించడంతో తాము మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు హరినాథ్‌ రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ సంఘటన స్థలంలో ఓ చేతి సంచిలో వారిద్దరి ఫొటోలతో కలిపి లభించింది. కాగా హరినాథ్‌ మొదటి భార్య కుమారుడు ప్రసన్నకుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రామ్‌సింగ్‌ తెలిపారు. మృతుడు స్థానికంగా డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పలిమెల ఎస్సై నరేష్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 

సూసైడ్‌ నోట్‌లో ఇలా..
శ్యామల చిన్న తమ్ముడు పండ్ల రాజు తరచు మా ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చేశాడు. ఇద్దరిని కొట్టి దూరం చేశాడు. అయినా మేమిద్దరం ఒక్కటయ్యాం. చంపుతానని  బెదిరించాడు. మీరే చావండి లేదా నేనే చంపుతా అని వేధించడంతో మనస్తాపానికి గురై సూసైడ్‌ చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Similar News