విజయవాడలో మిట్టమధ్యాహ్నం అంధకారం...

Update: 2018-06-02 10:48 GMT

ఆంధ్రప్రదేశ్‌లో నిన్నటి వరకు ఎండలతో భగభగలాడించిన సూరీడు శాంతించాడు. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో పాతాళ గంగ దగ్గర వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో కురిసిన  భారీ వర్షానికి పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

కృష్ణాజిల్లాలోని నందిగామ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. విజయవాడలో మిట్టమధ్యాహ్నం అంధకారం నెలకొంది. క్యుములో నింబస్ మేఘాల కారణంగా ఒక్కసారిగా అంధకారం అలముకుంది. భారీగా వీచిన ఈదురుగాలుల కారణంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఊడిపడ్డాయి. విపరీతంగా దుమ్మురేగటంతో రహదారులు ఒక్కసారిగా నిర్మానుష్యమయ్యాయి. విజయవాడలో పలుచోట్ల వర్షం పడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఏలూరు,తుణుకు,తాడేపల్లిగూడెం, ద్వారాకతిరుమలలో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో  స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిపై కొబ్బరి చెట్టు విరిగి పడడంతో అతను  తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చీరాల ఉడ్ నగర్ ప్రాంతంలో జరిగింది. 

Similar News