గబ్బిలాల బామ్మ...400 గబ్బిలాలను ఇంట్లో పెంచుకుంటున్న శాంతాబెన్

Update: 2018-05-26 06:31 GMT

నిఫా వైరస్.. యావత్ దేశాన్ని వణికిస్తుంది. ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రాణాలు తీస్తున్న నిఫా వైరస్ అంటేనే భయపడుతున్న వేళ.. గుజరాత్‌లో ఓ మహిళ ఏకంగా 400 గబ్బిలాలను పెంచుకుంటోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. గుజరాత్‌ గబ్బిలాల బామ్మ గురించి హెచ్ ఎం టీవీ ప్రత్యేక కథనం.. 

400 గబ్బిలాలు పెంపకం..ఈమె పేరు శాంతాబెన్ ప్రజాపతి. గుజరాత్‌ ఫైనాన్షియల్ సిటీ అహ్మదాబాద్‌కు 50 కిలోమీటర్ల దరంలోని రాజ్‌పూర్‌ గ్రామంలో ఉంటోంది. ఈమె తన ఇంట్లో ఏకంగా 400 గబ్బిలాలను పెంచుకుంటోంది.  గత పదేళ్ల కాలం నుంచి శాంతాబేన్.. గబ్బిలాలతోటే కాలం గడుపుతోంది. వాటికి అనుగుణంగా ఇంట్లోని గోడలను నిర్మించింది. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ రెండింటినీ గబ్బిలాలకే కేటాయించింది. ఇక పెంచుకోవడం అంటే కొంత స్థలాన్నే ఇవ్వకుండా.. గబ్బిలాలకు ప్రేమతో ఆహారాన్ని కూడా అందిస్తుంది. ఇటు గబ్బిలాల నుంచి వచ్చే ధూళి, దుమ్ము నుంచి కాపాడుకునేందుకు ఇంట్లో నిత్యం.. వేప, కర్పూరాన్ని మండిస్తుంది. 

 ఇక ఈ శాంతాబెన్‌ గబ్బిలాల పెంపకంపై చుట్టుపక్కలే కాదు.. దేశవ్యాప్తంగా ప్రచారం పొందింది. ఈమె గబ్బిలాలను ఎలా పెంచుకుంటుందన్న విషయంపై ఢిల్లీకి చెందిన ఓ స్టూడెంట్.. ఓ డాక్యుమెంటరీ కూడా తీశాడు. అయితే ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన నిఫా వైరస్.. ముఖ్యంగా గబ్బిలాల నుంచే వ్యాపిస్తుంది. ఇప్పటికే కేరళ నుంచి.. తెలుగు రాష్ట్రాలకు వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో.. ప్రతీ గబ్బిలమూ ప్రమాదకారే. వాటి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి ఇదే విషయమై శాంతాబెన్‌ను ప్రశ్నిస్తే.. గబ్బిలాలతో పదేళ్ల తన అనుబంధాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేనని తేల్చిచెప్పింది. 

తనదగ్గర పెరుగుతున్న గబ్బిలాల వల్ల నిఫా వైరస్‌ వస్తుందన్న భయం లేదని.. శాంతాబెన్ ధైర్యంగా చెబుతోంది. అంతేకాకుండా.. తనదగ్గర పెరుగుతున్న ప్రత్యేక తోక ఉన్న గబ్బిలాలు.. వైరస్‌ కారకాలు కాదని చెప్పుకొస్తుంది. ఇక శాంతాబెన్ ఇళ్లున్న ప్రాంతాన్ని బ్యాట్ కాలనీగా పిలుస్తుంటారు. ఆమె ఇంటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తుంటారు. ఏదేమైనా.. ఈ గబ్బిలాల బామ్మకు.. ధైర్యం చాలానే ఉందని జనాలు చెప్పుకుంటారు. 
 

Similar News