హైకోర్టు విభజనపై లోక్‌సభలో కేంద్రం ప్రకటన

Update: 2017-12-28 10:49 GMT

ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభలో ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో తాత్కాలిక భవనంలో హైకోర్టు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. తాత్కాలిక భవనం వెతుకుతున్నారని అనుకూలమైన భవంతి దొరకగానే హైకోర్టు ఏర్పాటు చేస్తమని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు స్పందించిన టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు నాలుగు భవనాలను చంద్రబాబు సూచించడం సంతోషకరమన్నారు. అయితే జడ్జిల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఏర్పాటు తమ పరిధిలోనే ఉందన్న రవిశంకర్ ప్రసాద్ జడ్జిల కేటాయింపు అంశాన్ని కొలిజియం పరిశీలిస్తుందని వివరణ ఇచ్చారు.   

విభజన సమస్యలపై జరిగిన చర్చలో జోక్యం చేసుకున్న టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనాచౌదరి హైకోర్టు ఏర్పాటుతో పాటు రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక హోదా వంటి అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయని గుర్తు చేశారు. కేవలం హైకోర్టు అంశాన్ని మాత్రమే కాకుండా అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు. అయితే విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు.

Similar News