సూర్యుడి రథం కదలకపోతే ?

Update: 2018-01-24 12:24 GMT

అది లంకలో యుద్ధ భూమి. మొదటి రోజు రామ - రావణుల మధ్య బీకరమయిన యుద్ధం జరిగింది. రెండు వైపులా మహా వీరులందరూ కేవలం ప్రేక్షకులుగా భూమ్యాకాశాలు బద్దలయ్యే ఆ యుద్ధాన్ని నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ఒక దశలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆలోచనలో పడ్డాడు - వీడిని గెలవడం అంత తేలిక కాదేమో అని. ఆ క్షణంలో అగస్త్యుడు ప్రత్యక్షమయ్యాడు. "రామ రామ మహాబాహో !" అంటూ ఆదిత్య హృదయం బోధించి, సూర్యుడిని ప్రార్థించి ఆ బలంతో వెంటనే రావణుడిని సంహరించు - అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. రాముడు అలాగే చేశాడు. అప్పటి నుండి లోకానికి ఆదిత్య హృదయం అందింది.


రోజులు ఏడు. సూర్యుడి రథం గుర్రాలు ఏడు. సప్తాశ్వారథమారూఢం - రోజులనే గుర్రాలుగా కిరణాల దారులమీద కోట్ల ఏళ్లుగా అలుపెరుగని రథం మీద ఆగని, ఆగకూడని ప్రయాణం సూర్యుడిది. 

విష్ణుసహస్రనామంలో - సూర్య చంద్ర నేత్రే -అని ఉంటుంది. విరాట్ పురుషుడి రెండు కళ్లు - సూర్య చంద్రులు. చెట్ల పత్రహరిత ప్రాణం పాదుకొల్పడానికి సూర్యుడు కారణం. మన శరీరంలో విటమిన్ లు ఏర్పడి ఎముకలు నిలబడడానికి కారణం సూర్యుడు. నీరు ఆవిరి అయి మేఘం ఏర్పడడానికి కారణం సూర్యుడు. నానా మురికి ఎండి చెత్త తగ్గడానికి కారణం సూర్యుడు. కుళ్ళినవి అలాగే మిగలకుండా వాడిపోయేలా కావడానికి కారణం సూర్యుడు. 


సూర్యుడు అసాధారణ పండితుడు. లెక్కల ఉపాధ్యాయుడు. అపరిమిత శక్తి ప్రదాత. అపరిమిత వేడితో తను రగిలిపోతూ - లోకాలకు వెలుగులు పంచే త్యాగి. అంతులేని వెలుగులు విరజిమ్మే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ.

ప్రత్యక్షంగా మన కంటికి కనపడే ఏకైక దైవం.

Similar News