Bhogi Festival 2026: శాస్త్రం ప్రకారం భోగి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? జనవరి 13నా.. 14నా? పండితుల స్పష్టత ఇదే
Bhogi Festival 2026 :తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ప్రత్యేక స్థానం దక్కించుకుంది.
Bhogi Festival 2026: శాస్త్రం ప్రకారం భోగి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? జనవరి 13నా.. 14నా? పండితుల స్పష్టత ఇదే
Bhogi Festival 2026 :తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ప్రత్యేక స్థానం దక్కించుకుంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవాల్లో మొదటి రోజు భోగి పండుగ. దక్షిణాయనం ముగిసి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే ముందు వచ్చే ఈ భోగి పండుగ మన సంప్రదాయాలకు, ఆచారాలకు ప్రతీకగా నిలుస్తుంది.
చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ కాలంలో చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. భగభగ మండే మంటల కారణంగానే ఈ పండుగకు ‘భోగి’ అనే పేరు వచ్చిందని పండితులు చెబుతారు. ఈ రోజుతోనే ధనుర్మాసం కూడా పూర్తవుతుంది.
భోగితో మొదలయ్యే సంక్రాంతి సందడి
సంక్రాంతి అంటే చాలు ఇళ్లంతా కొత్త కళ సంతరించుకుంటుంది. ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు, పిండి వంటల ఘుమఘుమలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, కోడి పందేలతో తెలుగు రాష్ట్రాలు పండుగ వాతావరణంలో మునిగిపోతాయి. ఈ మూడు రోజుల వేడుకలకు భోగి పండుగతోనే శ్రీకారం చుడతారు.
భోగి మంటను సామాన్యమైన మంటగా కాకుండా అగ్నిహోత్రంగా భావిస్తారు. ఇది ప్రతి ఇంటి ముంగిట జరిగే పవిత్ర హోమంలాంటిదని శాస్త్రం చెబుతుంది. అందుకే భోగి మంట చల్లారిన తర్వాత తీసిన భస్మాన్ని పిల్లల నుదుటిపై నామంగా పెట్టడం ఆనవాయితీ. పెద్దగా కాకపోయినా, చిన్నగా అయినా భోగి మంట తప్పకుండా వేయడం శుభప్రదమని పండితుల అభిప్రాయం.
అసలు సందేహం ఇదే!
ఈ ఏడాది భోగి పండుగను జనవరి 13న జరుపుకోవాలా? లేక జనవరి 14న జరుపుకోవాలా? అనే సందేహం చాలామందిలో నెలకొంది.
పంచాంగకర్తలలో అధిక శాతం మంది సౌరమానాన్ని ఆధారంగా తీసుకుని 2026లో పండుగలను జనవరి 14, 15, 16 తేదీల్లో జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఆ ప్రకారం చూస్తే భోగి పండుగ 2026 జనవరి 14వ తేదీనే జరుపుకోవాలి అని పండితులు స్పష్టం చేస్తున్నారు.
ఈ రోజే షట్తిల ఏకాదశి తిథి కూడా ఉంటుంది. ఈ తిథి జనవరి 13 మధ్యాహ్నం 3:18 గంటలకు ప్రారంభమై, జనవరి 14 సాయంత్రం 5:53 గంటల వరకు కొనసాగుతుంది.
భోగి రోజున చేయాల్సిన శుభకార్యాలు
భోగి పండుగ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఉత్తమం. నువ్వుల నూనె లేదా నువ్వుల పిండితో అభ్యంగన స్నానం చేస్తే శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది.
ఈ రోజున గోదా కళ్యాణాలు నిర్వహించడం ప్రత్యేకత. ముఖ్యంగా అవివాహిత కన్యలు గోదా కళ్యాణం దర్శించి, అక్కడి అక్షతలు ధరించితే త్వరలో వివాహం జరుగుతుందని నమ్మకం. అలాగే గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురాలు, రుక్మిణీ కళ్యాణం వంటి గ్రంథాలను పఠించడం శుభప్రదమని పెద్దలు చెబుతారు.
పిల్లలకు భోగి పళ్లు పోయడం కూడా ఈ రోజున ప్రత్యేక ఆచారం. కొందరు భోగి పండుగను గోదాదేవి విష్ణుమూర్తిలో ఐక్యమైన రోజుగా భావిస్తారు. ఆమెకు భోగం లభించిన రోజు కావడంతో ఈ పండుగకు భోగి అనే పేరు వచ్చిందని కూడా ఒక విశ్వాసం ఉంది.
ముఖ్య గమనిక:
ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలు, పంచాంగాలు, పండితుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మీ ప్రాంతాల్లో పాటించే సంప్రదాయాల ప్రకారం నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.