కాంగ్రెస్‌తోనే మహిళాభివృద్ధి: రాహుల్

Update: 2018-08-13 11:25 GMT

నరేంద్ర మోదీ ప్రభుత్వం సామన్య ప్రజలకు చేసిందేమీ లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా సోమవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన.. రాజేంద్రనగర్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ హాల్‌‌లో మహిళా స్వయం సహాయక బృందాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ...‘ మహిళలు ఎదగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.  ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు వెళితేనే అభివృద్ధి జరుగుతుంది. మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలో 17 మంది పారిశ్రామికవేత్తలకు 2.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. రైతులు, మహిళా సంఘాల రుణాలు మాత్రం మాఫీ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళా రుణాల వడ్డీ భారాన్ని భరిస్తామన్నారు. అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామని, మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని రాహుల్‌గాంధీ ఆకాంక్షించారు. మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకే రుణాలిస్తున్నాయని, రైతులు, మహిళా సంఘాలు, చిరు వ్యాపారులకు రుణాలు అందడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రుణాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కనీస మద్దతు ధర కోసం మోదీ ప్రభుత్వం 10 వేల కోట్లు కేటాయిస్తే.. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 30 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిందని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల ఎదుట పేదలే లైన్లలో ఉన్నారని, బ్యాంకుల ఎదుట ధనవంతులెవరైనా లైన్లలో నిల్చున్నారా అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

Similar News