పవన్ తీరుపై.. జనాల్లో కొత్త చర్చ

Update: 2018-03-15 11:30 GMT

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సడన్ గా తెలుగుదేశం పార్టీపై విపరీతమైన ఆరోపణలు చేయడం వెనక అసలు సంగతి ఏంటని.. కొత్త అనుమానం పుట్టుకొచ్చింది. కొందరేమో.. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకే.. తెలుగుదేశానికి బలైమన ప్రత్యర్థిగా అవతరించేందుకే పవన్ కల్యాణ్ ఇలా ఉన్నఫళంగా యూ టర్న్ తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ లేని ఆగ్రహావేశాలు.. ఇన్నాళ్లూ లేని అనుమానాలు.. ఇన్నాళ్లూ లేని ఆరోపణలు.. ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చాయన్న అనుమానం కూడా.. రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

నిజమే. ఏపీకి అన్యాయం జరిగింది. కేంద్రం తీరని అన్యాయం చేసింది. దక్షిణ భారత రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం మొదటి నుంచి చిన్న చూపే చూస్తోంది. ఈ విషయాన్ని చాలా కాలంగా పవన్ కూడా చెప్పుకొస్తున్నారు. నిన్నటి సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ఇంకాస్త సూటిగా చెప్పి.. మరింత స్పష్టంగా కేంద్రాన్ని నిలదీశారు. అవసరమైతే ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష కూడా చేస్తానన్నారు. ఆ ప్రయత్నంలో.. టీడీపీని కూడా ఇంతగా ఏకిపారేస్తారని మాత్రం ఎవరూ ఊహించలేదు. దీనిపై సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చ జరుగుతోంది.

అందుకే.. ఇప్పుడు జనసేనానిగా అధికార, విపక్షాలకు ప్రశ్నలు వేయడం కాదు. ప్రజలే.. పవన్ కు ప్రశ్నలు విసురుతున్నారు. జవాబులు చెప్పాలని.

మహిళా అధికారిణిపై జరిగిన అన్యాయం గురించి గొంతెత్తిన పవన్.. సంఘటన జరిగిన నాడే మాట్లాడి ఉంటే.. సదరు అధికారిణికి కొండంత అండ ఉండేది కదా.. ఆమె ఆత్మస్థైర్యం నిలబడేది కదా? అప్పుడెందుకు మాట్లాడలేదు?

లోకేష్ అవినీతిపై ఇంత సమాచారం ఉన్న పవన్.. ఇప్పుడు ఆవిర్భావ సభ వరకూ ఎందుకు ఎదురుచూడాల్సి వచ్చింది? సరిగ్గా ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తరుణంలోనే ఇంతగా ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చింది?

లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసిన పవన్.. చంద్రబాబుపై కూడా ఎన్నో కేసులు ఉన్నాయని.. వాటిలో స్టేలు తెచ్చుకుని ఆయన లీగల్ సమస్యల నుంచి బయటపడ్డారని పవన్ కల్యాణ్ కు తెలియదా? తెలిసినా మాట్లాడలేదా?

నిజ నిర్థారణ కమిటీ పేరుతో హంగామా చేసిన పవన్.. ఆ విషయాన్ని ఎందుకు ముందుకు తీసుకుపోవడం లేదు?

ఆగస్టు 14న మేనిఫెస్టో ప్రకటిస్తానని చెబుతున్న పవన్ అసలు టార్గెట్ ఎవరు? అందరూ అనుకుంటున్నట్టు వైసీపీనా? ఇప్పుడు తాను చెప్పినట్టు టీడీపీనా? రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రమా? అసలు పవన్ పోరాటం ఎవరిమీద?

మేనిఫోస్టో ప్రకటిస్తా అని చెబుతున్నారంటే.. అన్ని సీట్లకూ పోటీ చేస్తున్నట్టేనా? ఈ విషయంలో పవన్ నుంచి మరో మాట వినకుండా ఉండగలమా? మేనిఫెస్టో వరకూ పవన్ మళ్లీ జనాల్లోకి వస్తారా.. రారా?

ఇలా.. రకరకాలుగా జనాలు పవన్ తీరుపై చర్చించుకుంటున్నారు. వీటికి పవన్ కల్యాణ్ జవాబులు చెబుతారా? మళ్లీ కొన్నాళ్లూ సైలెంట్ గా ఉండి.. తర్వాత మరో సభ పెట్టి ఆవేశంగా మాట్లాడతారా అన్నది చూడాల్సిందే.
 

Similar News