అది అభిమానమా.. పిచ్చా?

Update: 2018-01-24 08:17 GMT

అది అభిమానమా.. పిచ్చా? కనీస అవగాహన లేని యువత జనసేన కార్యకర్తలమంటూ విర్రవీగుతున్నారు. అసలు పార్టీ అధినేత చెప్పేదేమీ వినకుండా.. సెల్‌ఫోన్లతో సెల్పీలు తీసుకోవడానికి పోటీలు పడుతున్నారు. పవన్‌తో కరచాలనం చేసేందుకు ఆరాటపడుతున్నారు. పార్టీ విధి, విధానాలను జనంలోకి తీసుకెళ్లాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తుంటే.. అభిమానులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అసలు వీళ్లతో పార్టీ నడపడం సాధ్యమేనా..? భవిష్యత్‌లో జనసేన అధినేత పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారు..? 

తెలంగాణలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటనతో యువతలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి నుంచి మొదలైన పవన్ యాత్రలో ఎక్కడ చూసినా పిచ్చి అభిమానం కనిపిస్తోంది. రాజకీయ అనుభవం గానీ, అవగాహన గానీ.. ఉన్న నేతలు, మహిళలు ఒక్కరంటే ఒక్కరైనా కనిపించడం లేదు. 

జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పవన్ అభిమానులే.. పార్టీలో కీలకపాత్రను పోషిస్తున్నారు. అయితే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా క్రియాశీల కార్యకర్తలు గానీ, పార్టీ కమిటీలు గానీ లేవు.  పార్టీ అధినేత పవన్ కల్యాణే అన్నీ తానై చూసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ప్రజాక్షేత్రంలోకి ఆయన అడుగుపెట్టడంతో యువతలో ఉత్సాహం ఉరకలేస్తోంది. కనీసం పార్టీ అధినేత ఏం చెబుతున్నారనే దాన్ని కూడా గ్రహించే స్థితిలో అభిమానులు ఉండటం లేదు. సెల్‌ఫోన్లతో వేలం వెర్రిగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. 

ఇంత తెలివి తక్కువ, తిక్క, అజ్ఞానపు, మూర్ఖపు, కనీస ఆలోచన లేని యువతను.. చూశాక తెలుగు రాష్ట్రాల భవిష్యత్‌పై ఆందోళన కలుగుతుందని పలువురు విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ అన్ని జిల్లాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని, లేకుంటే ఫస్ట్ షో బ్యాచ్.. ఆకర్షితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో పీఆర్పీ పేరుతో చిరంజీవి ప్రజలను మభ్యపెట్టి అనేక మంది ఔత్సాహిక రాజకీయవేత్తలను నట్టేట ముంచేశారని, అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడుగా ఉన్న పవన్ కల్యాణ్ ముందు వాటికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి పవన్ కల్యాణ్.. ఈ ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారు..? జనసేన పార్టీని ఈ అభిమానులతో ఎలా నడిపిస్తారో చూడాలి. 

Similar News