మురికి కాలువలో పసికందు..

Update: 2018-08-16 10:22 GMT

అప్పుడే పుట్టిన శిశువును మురికి కాలువలో పడేశారు. ఆ శిశువు ఏడుపులు విన్న ఓ మహిళ.. ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడింది. ఈ హృదయ విదారక సంఘటన చెన్నైలో నిన్న చోటు చేసుకుంది.చెన్నైలోని వలసరవక్కం ప్రాంతంలో బుధవారం ఉదయం పాలు పోసే వ్యక్తికి కాలువలో ఏడుపు శబ్దం వినిపించింది. దీంతో అతడు అక్కడ ఉన్న గీత అనే మహిళకు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి కాలువపై ఉన్న బండ రాయిని పక్కకు జరిగి కిందకు వంగి చూడగా గీత షాక్‌కు గురైంది. అందులో అప్పుడే పుట్టిన పసికందు వరద నీటికి కొట్టుకొచ్చి అక్కడ చిక్కుకుని ఏడుస్తున్నాడు. దీంతో వెంటనే ఆమె లోపలికి వంగి చిన్నారి కాళ్లు పట్టుకుని పైకి లాగి బయటకు తీసింది. మెడకు చుట్టుకుని ఉన్న బొడ్డుతాడును జాగ్రత్తగా తొలగించింది. మరో మహిళను నీళ్లు తెమ్మని అడిగి చిన్నారికి అంటుకుని ఉన్న మురికిని శుభ్రం చేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని తక్షణమే ఎగ్మూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పసికందు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శిశువును అనాథ ఆశ్రమానికి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు. 
 

Similar News