నాగావళి ఉగ్రరూపం

Update: 2018-07-21 11:53 GMT

నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒడిశాలోని రాయగడ జిల్లా జమిడిపేట వద్ద బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జ్ కూలిపోయిన సమయంలో ఎవరు లేకపోవడంతో పెను  ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జన జీవనం స్తంభించిది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగావళి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతికి రాయగడ జిల్లా జమిడిపేటలోని బ్రిడ్జ్ మధ్య భాగం భారీ శబ్దతో కూప్పకూలింది.

వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్ నీటిలో కొట్టుకుపోయింది. ఈ బ్రిడ్జ్ కూలుతున్న సమయంలో స్థానికులు హహాకారాలు చేశారు. అందరూ చూస్తుండగానే బ్రిడ్జ్  మిగతా భాగం నీటిలో కొట్టుకుపోయింది. నాగావళి బ్రిడ్జ్ నీటిలో కొట్టుకుపోతుండగా స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. భయంతో గట్టిగా కేకలు వేశారు. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో బ్రిడ్జ్ పై ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఒడిశాలోని పలు రైల్వే ట్రాక్ లపై వరదనీరు వచ్చి చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయగడ రైల్వేస్టేషన్ సమీపంలో భువనేశ్వర్ నుంచి  జగదల్ పూర్  వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ వరద నీటిలో చిక్కుకుపోయింది. రైల్వే పట్టాలపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండంతో రైలును అక్కడే నిలిపివేశారు. ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. 

విజయనగరంలో జిల్లా తోటపల్లి డ్యాం  వద్ద నాగావళి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. డ్యాంలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో తోటపల్లి డ్యాంలోని నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నాగావళి వరద ఉధృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నాగావళి వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో  పలు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాలు పట్టపగలే చీకటిగా మారాయి. వాహన దారులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

Similar News