భార్యను చూసి భావోద్వేగం...ఎమ్మెల్యేకు గుండెపోటు

Update: 2018-01-09 11:33 GMT

లక్నో బాందా జైలులో యూపీ ఎమ్మెల్యే ముక్తార్‌ అన్సారీకి తీవ్ర గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ముక్తార్‌ అన్సారీ భార్య సైతం ఛాతీ నొప్పితో బాధపడుతున్నట్టు చెప్పడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజకీయవేత్తగా మారిన మాఫియాడాన్‌ అన్సారీని కలిసేందుకు భార్య బాందా జైలుకు వచ్చిన సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ముఖ్తార్ అన్సారీ గత ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన 'ఖ్వామి ఏక్తా దళ్' పార్టీని బీఎస్‌పీలో విలీనం చేశారు. అనంతరం మవు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే నియోజవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన రికార్డు ఆయనకు ఉంది. వివిధ క్రిమినల్ కేసుల్లో 2015 నుంచి ఆయన జైలులో ఉంటున్నారు. 2016 జూన్‌లో అన్నారీ తన 'క్యూఈడీ' పార్టీని శివపాల్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీలో కలుపుతానని ప్రకటించారు. అయితే అఖిలేష్ యాదవ్ ఈ నిర్ణయంతో విభేదించారు. దీంతో తన నిర్ణయాన్ని మార్చుకున్న అన్సారీ 2017లో తన పార్టీని బీఎస్‌పీలో కలిపేశారు. ఆ తర్వాత బీఎస్‌పీ అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచారు.

Similar News