మిగిలిన ఆరుస్థానాల్లో అభ్యర్థులెవరు..?

Update: 2018-11-17 10:38 GMT

మహాకూటమిలో ఇంకా 8 స్థానాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. సికింద్రాబాద్, కోరుట్ల, దేవరకద్ర, నారాయణపేట, పటాన్‌చెరు, మిర్యాలగూడ, నారాయణఖేడ్, వరంగల్ ఈస్ట్ పెండింగ్‌‌లో ఉన్నాయి. ఇందులో ఆరు స్థానాలు కాంగ్రెస్, రెండు స్థానాలు టీడీపీకి కేటాయించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు వేర్వేరు అభ్యర్థులను ప్రతిపాదిస్తుండటంతో అవి తేలడం లేదు. దేవరకద్ర, నారాయణపేటల్లో డీకే అరుణ, జైపాల్‌రెడ్డి కారణంగా అభ్యర్థులు ఖరారు కావడం లేదు. ఈ రెండు స్థానాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేరుగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. 

ఇక సనత్‌నగర్ నియోజకవర్గాన్ని  పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించడంతో మర్రి శశిధర్‌రెడ్డికి సికింద్రాబాద్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్‌ కోసం బండ కార్తీకరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్‌ పోటీపడుతున్నారు. మిర్యాలగూడ టిక్కెట్టును జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి ఆశిస్తున్నారు. అయితే, ఈ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. కోరుట్లలో జువ్వాడి నర్సింగరావు, కొమిరెడ్డి రాములు, నారాయణఖేడ్‌లో శరత్‌కృష్ణ, శివకుమార్‌రెడ్డి పోటీపడుతున్నారు. అలాగే, దేవరకద్రలో పవన్‌కుమార్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్ గౌడ్, వరంగల్ ఈస్ట్‌లో గాదె ఇన్నయ్య, వద్దిరాజు రవిచంద్ర పోటీ పడుతున్నారు. దీంతో ఈ స్థానాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రేపు సాయంత్రానికి ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 
 

Similar News