బెంగళూర్‌ రోడ్లపై ప్రత్యక్షమైన యముడు

Update: 2018-07-13 09:00 GMT

రోడ్లపై యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. నడిరోడ్డుపై క్లాస్‌ పీకుతున్నాడు. అదేంటి యమధర్మరాజు ప్రత్యక్షమవ్వడం ఏంటని అనుకుంటున్నారా? ఆ యమధర్మరాజుకు భూలోకంలో పనేంటనుకుంటున్నారా అదేంటో తెలుసుకోవాలంటే  స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

బెంగళూర్‌ రోడ్లపై యమధర్మరాజు యమబిజీగా చక్కర్లు కొడుతున్నాడు. బైక్‌ రేసింగ్‌ కిక్‌లో హెల్మెట్‌ పెట్టుకోకుండా రయ్‌మంటూ దూసుకుపోతున్నయువత స్పీడ్‌కు బ్రేక్‌లు వేస్తున్నాడు. పోతావురా చచ్చిపోతావురా అంటూ హెల్మెట్‌ పాఠాలు చెబుతున్నాడు. కంగారు పడకండీ రోడ్లపై కనిపిస్తున్న ఆ యమధర్మరాజు నిజమైన యముడు కాదులెండీ. భుజం మీద గధ, ఒంటి నిండా నగలు, నెత్తిపై కొమ్ముల కిరీటం పెట్టుకుని అచ్చు యమధర్మరాజు వేషంలో అటు ఇటు తిరుగుతున్న ఈ వ్యక్తి ఓ పోలీసాఫీసర్‌. రోడ్లపై హెల్మెట్ ధరించని వాహనదారులకు యముడి వేషాధారణలో సూచనలు ఇస్తున్నాడు. 'ట్రాఫిక్ అవెర్‌నెస్ వీక్'లో భాగంగా హెల్మెట్ ఆవశ్యకతను గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి  బెంగళూరులోని ఉల్సూరు పోలీసులు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

యమధర్మరాజు వేషంలో ఉన్న ఈ పోలీస్  రోడ్లపై  హెల్మెట్ ధరించని వాహనదారులను ఆపి వారికి గులాబీ పువ్వు ఇవ్వడంతోపాటు, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. యమధర్మరాజను మీ జీవితాల్లోకి ఆహ్వానించకండి హెల్మెట్ ధరించండి అంటూ వారికి ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. బెంగళూరులో హెల్మెట్ విధానాన్ని పకడ్భందీగా అమలుచేస్తున్నప్పటికీ ఇప్పటికీ కొందరు హెల్మెట్ ధరించడం లేదు. దీంతో ఇక్కడి ట్రాఫిక్ నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేస్తున్న వారితో పాటు వెనుక కూర్చున్నవారు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందేనని  నగరవాసులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడానికి ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి కార్యక్రమాలకు చేపడుతున్నారు. 

Similar News