ఫలితాల వెల్లడితో అట్టర్ ఫ్లాప్ అయిన సర్వే

Update: 2018-12-12 04:45 GMT

అదిగో మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తోందంటూ లగడపాటి విసిరిన లాజిక్కులు పారలేదు. ఆచితూచి సర్వే ఫలితాలు వెల్లడించినా ఆంధ్రా ఆక్టోపస్‌కు పరాభవం తప్పలేదు. టీఆర్ఎస్ ప్రబంజనంతో  తాను చేసిన సర్వేను సమర్ధించుకునే ఏ మార్గం కానరాక సైలెంట్ అయ్యారు. ఇక నెట్టింట్లో అయితే లగడపాటి లెక్కలపై నెటీజన్ల తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు .     

ఈ నెల ఏడున పోలింగ్ ముగిసిన వెంటనే ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి వెల్లడించిన ఎన్నికల ఫలితాలు ఇవి. మహాకూటమి విజయంపై ధీమా వ్యక్తం చేసిన ఆయన ఫలితాలు రాగానే సైలెంట్ అయ్యారు. 55 నుంచి 75 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడుతుందంటూ లగడపాటి రాజగోపాల్ బయటపెట్టిన సర్వే  అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కనీసం సగం సీట్లు కూడా రాకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఇక టీఆర్ఎస్‌ 20 శాతం 35 శాతం సీట్లు సాధిస్తుందని లగడపాటి చెప్పగా  ఏకంగా 88 స్ధానాల్లో గెలిచి 74 శాతం సీట్లను కారు పార్టీ కైవసం చేసుకుంది. 

సర్వే ఫలితాలను వెల్లడించే సమయంలో లగడపాటి చేసిన ఈ ఒక్క వ్యాఖ్య నిజం కాలేదు. ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందన్న లగడపాటి ప్రజా కూటమి హామీలపై ప్రజల్లో సానుకూల స్పందన వస్తోందన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏఒక్క చోట ప్రభుత్వ పరంగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఒక్క ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో మాత్రమే టీఆర్ఎస్ వెనకబడింది.  109 స్ధానాలకు గాను ఏకంగా 87 చోట్ల విజయం సాధించి సరికొత్త రికార్డు స్పష్టించింది. 

గతంలో ఎన్నడు లేని స్ధాయిలో లగడపాటి సర్వేపై వివాదాలు, విమర్శలు, అనుమానాలు, అపోహలు తలెత్తాయి. లగడపాటి సర్వేకు ఎన్నికల ఫలితాలే సమాధానం చెబుతాయన్న కేటీఆర్  చేతల్లో అనుకున్నది అనుకున్నట్టే చేసి చూపారు. లగడపాటి సర్వేను చిత్తు కాగితంగా మారుస్తూ 75 శాతం భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నారు. ఇక మహాకూటమిగా జట్టుకట్టిన నాలుగు పార్టీల్లో రెండు ఖాతాలు కూడా తెరవలేకపోయాయి. మిగిలిన రెండు పార్టీల్లో ప్రధాన పక్షం టీడీపీ రెండు స్ధానాలతో సరిపెట్టుకోగా కాంగ్రెస్ 19 సీట్లకే పరిమితమైంది. దీంతో లగడపాటి సర్వేపై నెటీజన్లు తమదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు.  రాజకీయ సన్యాసం తరహాలోనే సర్వేల సన్యాసం తీసుకుంటారా అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు . 

Similar News