టి.కాంగ్రెస్‌ నేతలపై కుంతియా ఎందుకంత హర్ట్‌ అయ్యారు?

Update: 2018-06-02 11:07 GMT

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గానున్న  కుంతియాను మారుస్తారు అని కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏపి ఇన్ చార్జ్ ను మార్చడంతో  తెలంగాణ ఇన్ చార్జ్ మారడం ఖాయమనే ప్రచారం గాంధీ భవన్ లో జోరందుకుంది. కొందరు కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా కొత్త ఇన్ చార్జ్ గా గులాం నబీ ఆజాద్ వస్తున్నారని సోషల్ మీడియాలో హడివిడి చేస్తుండడంపై కుంతియా కుతకుతలాడిపోతున్నారు. 

నాలుగో విడత బస్సుయాత్ర సన్నాహక సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. కొత్త ఇన్ చార్జ్ గా ఆజాద్ వస్తున్నారనే ప్రచారంపై పార్టీ నాయకుల వద్ద కుంతియా అసంతృప్తి వ్యక్తం చేశారు. హై కమాండ్  నుండి అధికార ప్రకటన రాకముందు ఈ తరహా ప్రచారం చేయడం తనను అవమానపరిచినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తన స్థానంలో ఆజాద్ వస్తున్నారని ప్రచారం చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలంటూ కుంతియా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ఇన్ చార్జ్ బాధ్యత స్వీకరించినప్పటి నుంచి కుంతియా సమర్థతపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఇన్ చార్జ్ లతో  పోల్చితే కుంతియాకు అంత సీన్ లేదని హై కమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. అధికార టీఆర్ ఎస్ ను ఎదుర్కొవాలంటే గులాం నబీ ఆజాద్ లాంటి వ్యూహాకర్త ఇన్ ఛార్జ్ గా వుండాలని కోరుతున్నారు. కుంతియా విషయంలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Similar News