దేవభూమిలో ప్రకృతి విలయతాండవం

Update: 2018-08-18 14:26 GMT

దైవభూమిగా ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరొందిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వస్తున్న  వరదలకు కేరళ ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి అదుపులోకి వచ్చినా  ఎప్పుడూ ఏ వైపునుంచి వరద ప్రవాహం ముంచుకొస్తుందోనని జనం బిక్కుబిక్కుమంటున్నారు. కేరళ విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు త్రివిధ దళాలు, విపత్తు నిర్వహణ బృందాలు రేయింబవళ్లు  ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.  దాదాపు 13 జిల్లాల్లో ఇంకా రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 100 డ్యాములు, రిజర్వాయర్లు, నదులు వరదలతో  మునిగిపోయాయి.  వేల కొద్ది ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వందలమంది ప్రాణాలు  కోల్పోయి , లక్షలమంది నిరాశ్రయులయ్యారు. రహదారులు ధ్వంసమయ్యాయి. వరదల ప్రభావంతో ఆగస్టు 26 వరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. పెట్రోల్‌ బంకుల్లో ఇంధన నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి.  పాతనమ్‌తిట్టా, ఆలప్పుజా, ఎర్నాకులం, త్రిసూర్‌ జిల్లాల్లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. ఇక  కేరళ పరిస్థితి చూసి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ చేతనైనంత సహాయం చేస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వరదబాధితులకు 25 కోట్లు విరాళం ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 10 ప్రకటించారు.  

Similar News