కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ పరిరక్షణకు కొత్త ప్లాన్...రంగంలోకి డాగ్ స్వ్కాడ్

Update: 2018-12-24 05:43 GMT

అడవుల సంరక్షణ వన్యప్రాణుల వేట చెట్లు నరికివేతను అరికట్టేందుకు ఫారెస్ట్ శాఖ సరికొత్త వ్యూహాలను తెరపైకి తీసుకువచ్చింది. పోలీస్ శాఖ మాదిరిగానే అటవీశాఖలోనూ డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించింది. డాగ్ స్క్వాడ్ తో స్మగర్ల ఆగడాలకు చెక్ పెట్టినట్లయ్యింది. తెలంగాణలో కవ్వాల్ అభయారణ్యంలో మొదటిసారిగా అడుగుపెట్టిన డాగ్ స్క్వాడ్. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ పరిరక్షణకు అటవీశాఖ కొత్త ప్లాన్ తో ముందుకు వెళుతోంది. కలపస్మగ్లర్లు, వన్యమృగాలవేట గాళ్ల ఆటపట్టించేందుకు డాగ్ స్క్వాడ్ ను రంగంలోగి దించారు. జర్మన్ షపర్డ్ జాతికి చెందిన శునకం చీతాను కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో అటవీ పరిరక్షణ సేవలకు ఉపయోగిస్తున్నారు. 

మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లోని బీఎస్ఎఫ్ శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలలపాటు శిక్షణ పొందిన ఛీతా సేవలు ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఛీతాతో పాటు జన్నారం డివిజన్ కు చెందిన ఇద్దరు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లకు కూడా గ్వాలియర్‌లోనే శిక్షణనిచ్చారు. కవ్వాల్‌లో సంచరించే పులులు, ఇతర వన్యప్రాణులు, మృగాలు సంచరించిన స్థలాల్లో వాటి వాసనను కనిపెట్టి వాటి గమనం, సంచారం ఎటువైపు ఉందో ఈ డాగ్ స్క్వాడ్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. అడవుల్లో నేరాలకు పాల్పడే వారిని అదుపులోకి తీసుకునేందుకు డాగ్ స్క్వాడ్ పని చేస్తుందంటున్నారు ఫారెస్ట్ అధికారులు. స్థానికంగా అందుబాటులో ఉన్న మేలురకం శునాకలను కూడా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి డాగ్ స్క్వాడ్ లను మరిన్ని అటవీ ప్రాంతాలకు విస్తరింప చేయాలన్న ఆలోచనలో అటవీశాఖ  యోచిస్తుంది.  

Similar News