జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యం

Update: 2018-03-19 06:22 GMT

ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..!. ఇదంతా ఏ కల్పితం కాదండోయ్.. పంచాంగ కర్తలు చెబుతున్న మాటలు. ‘ప్రజా సంకల్ప యాత్ర’లో ఉన్న వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంప్రదాయ వస్త్ర ధారణతో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన్ను స్వాములు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం.. పంచాంగ కర్తలు.. జగన్ పంచాంగం చూశారు.

విళంబి అంటే పొడవైనదనే అర్థం వస్తుందని, అధిక మాసాలు ఎక్కువ ఉన్నందున దీన్ని పొడవైన సంవత్సరంగా భావించవచ్చని శ్రీరామకృష్ణ శర్మ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌ 25 వరకూ జగన్‌మోహన్‌రెడ్డి జాతకంలో ఉన్న గోచార సమస్యలు పూర్తి కానున్నాయని తెలిపారు. అవి పూర్తి కాగానే జగన్‌ కీర్తి మరింత పెరుగుతుందని, 2019 ఎన్నికలకు ముందే ఆయనకు బుధ మహాదశ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇదంతా తాము ముఖస్తుతి కోసం చెప్పడం లేదన్నారు. 2019లో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 135 అసెంబ్లీ సీట్లు వస్తాయని, జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.

40 మంది పంచాంగకర్తలం కూర్చుని భవిష్యత్తులో జరగబోయేదాన్ని అంచనా వేశామని, ఈ అంచనాలు ఏకాభిప్రాయమని అన్నారు. తాను చెప్పింది జరగకపోతే ఇక జీవితంలో మరెక్కడా పంచాంగ శ్రవణం చేయబోనని అన్నారు. జగన్‌కు, రాష్ట్రానికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆరిమండ వరప్రసాదరెడ్డి సహకారంతో మహారుద్ర సహిత సహస్ర చండీయాగం తలపెట్టామని, రెండేళ్లపాటు యాగం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్‌ పూర్ణాహుతి కోసం వస్తారని పురోహితులు శుభ వచనాలు పలికారు. గత నాలుగేళ్లుగా జగన్‌ ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనేనని చెప్పారు.  
 

Similar News