పీఎస్‌ఎల్వీ సీ-43 ప్రయోగం విజయవంతం

Update: 2018-11-29 08:46 GMT

ఇస్రో మరో ఘనత సాధించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి43 వాహకనౌకను ఇవాళ ఉదయం 9.58 గంటలకు విజయవంతంగా ప్రయోగించింది. నాలుగు దశలుగా సాగిన ప్రయోగం విజయంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ-సి43 ద్వారా మన దేశానికి చెందిన హైపవర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. 

యూఎస్‌కు చెందిన 23 ఉపగ్రహాలు, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్‌, మలేషియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహంతో కలిపి 261.5 కిలోల బరువున్న 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఇందులో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి. మన దేశానికి చెందిన హైపవర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం బరువు 380 కిలోలు. ‘ఆప్టికల్‌ ఇమేజింగ్‌ డిపెక్టర్‌ ఆరె చిప్‌’ ఇందులో ఉంది. దీన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ప్రధాన విభాగమైన అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ వారు రూపొందించారు. ఆ తర్వాత చండీగఢ్‌లోని సెమికండక్టర్‌ ప్రయోగశాల వారు తయారుచేశారు. 630 కిలోమీటర్ల దూరం నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలను తీసే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర మండలాల అంచనా, లోతైన నీటి, మట్టి, ఇతర భూగర్భ పరిసరాలకు సంబంధించి అనేక రకాల అనువర్తనాలకు సేవలందిస్తుంది.

Similar News