ఏపీలో జోరందుకున్న ఐటీ రంగం

Update: 2018-02-16 01:10 GMT

ఏపీలో మెల్లమెల్లగా ఐటీ రంగం జోరందుకుంటోంది... ఐటీ కంపెనీలతో పాటు... వాటిని పెట్టాలనుకునేవారికి పెట్టుబడులు సమకూర్చే సంస్థలు, వాటిలో పనిచేయాలనుకునే యువతకు శిక్షణ ఇచ్చే ఏజెన్సీలు... ఇలా అన్నింటితో కూడిన సమగ్రమైన ‘ఐటీ వాతావరణం’ వస్తోంది... రాజధాని అమరావతి ఏరియాలోని అమరావతి, మంగళగిరితోపాటు గన్నవరం ప్రాంతాలను ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.. మంగళగిరిలో ఇప్పటికే ఏపీఐఐసీకి చెందిన 22 ఎకరాల్లో ఐటీ పార్కును నెలకొల్పి పై డాటా, పై కేర్‌, వీ సాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు రూపుదిద్దుకున్నాయి... తాజాగా మంగళగిరి బైపాస్‌ వెంబడి ఎన్‌ఆర్‌టీ టెక్‌ పార్కు(13), ఆటోనగర్‌ ఐటీ పార్కు(3)ల్లో 16ఐటీ కంపెనీలను ఐటీ మంత్రి లోకేష్‌ ప్రారంభించారు.
అయితే ఇక్కడ ఐటి కంపెనీల స్థాపన కోసం డిమాండ్ ఎక్కువుగా ఉంది... దీంతో, ఈ వేగాన్ని కొనసాగిస్తూ మంగళగిరిలో మరో రెండొందల ఎకరాల విస్తీర్ణంలో పెద్దఎత్తున ఐటీ రంగాన్ని విస్తరించాలని మంత్రి లోకేష్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో పట్టణంలోని బైపాస్‌ రోడ్డు వెంబడి వున్న 95 ఎక రాల అసైన్డు భూమిని గుర్తించారు. ఈ భూమి ఇప్పటికే సగం విస్తీర్ణంలో ఆక్రమణలకు గురైవుంది. ప్రస్తుతం మిగిలివున్న యాభై ఎకరాల్లో సుమారు 30 ఎకరాలను ఐటీ పార్కు-2 కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది...
రాష్ట్రంలో ఐటీ విస్తరణకు రెండు, మూడు మార్గాల్లో కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఐటీ శాఖ నేరుగా కంపెనీలను తీసుకొస్తుండడం... రెండోది ఏపీ ఎన్నార్టీ చొరవతో ఐటీ సంస్థలు రావడం! ఏపీఎన్నార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏర్పాటుచేసిన నాలుగు ఐటీ టవర్లు ఇప్పటికే కంపెనీలతో నిండిపోయాయి... విజయవాడ ఆటోనగర్‌లో ఇండ్‌వెల్‌ టవర్స్‌, మహానాడు రోడ్‌లోని కే-బిజినెస్‌ స్పేసెస్‌, గన్నవరం సమీపంలోని మేథా టవర్స్‌, అదేవిధంగా మంగళగిరి ఐటీ పార్కులోని మేథా టవర్స్‌... ఈ నాలుగూ ఐటీ కంపెనీలతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడు 60 వేల చదరపు అడుగులతో ఉన్న ఏపీఎన్నార్టీ టెక్‌పార్కు కూడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో నిండుతోంది. కొత్తగా వచ్చే సంస్థలకోసం గన్నవరంతోపాటు, విజయవాడ - గుంటూరు మధ్య ఉన్న పలు భారీ భవనాలను ఐటీ శాఖ, ఏపీఎన్నార్టీ అద్దెకు తీసుకుంటున్నాయి. సగం అద్దె ఐటీశాఖ భరిస్తుండగా, సగం అద్దెను మాత్రం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు చెల్లించేలా ప్రోత్సాహకం ఇస్తున్నారు.
 

Similar News