తెలంగాణలో భారీ వర్షాలు..

Update: 2018-08-13 04:29 GMT

గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న  భారీ వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవవడంతో జనజీవనం స్తంభించింది. వాగులు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి.  ఇక నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిలిచిపోగా..  సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, ఖమ్మం, భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వర్షాల ధాటికి గోదారి, మానేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. కుంటాల, పొచ్చెర జలపాతాలకు వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. భారీవర్షాల కారణంగా మత్తడి వాగు 3 గేట్లు ఎత్తారు. కడెం ప్రాజెక్టు 13 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.  బెల్లంపల్లి, మంచిర్యాల, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లో పనులు ఆపేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దౌతుపల్లి వాగులో డీసీఎం కొట్టుకుపోయింది. అందులోని ప్రయాణికులను స్థానికులు రక్షించారు. 

Similar News