కేసీఆర్ మరో ఆకర్షణీయ పథకం... 52 రకాల వైద్య పరీక్షలిక ఉచితం!

Update: 2018-06-02 06:16 GMT

ఇప్పటికే రైతుబంధు, ఉచిత జీవిత బీమా వంటి పథకాలతో దూసుకెళుతున్న కేసీఆర్ ప్రభుత్వం, మరో ఆకర్షణీయ పథకానికి రూపకల్పన చేసింది. 52 రకాల పరీక్షలను ఉచితంగా జరిపే 'తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకం' (టీ డయాగ్నోస్టిక్స్‌) అధికారికంగా ఈనెల 8న ప్రారంభం కానుంది. దీనిద్వారా రాష్ట్ర ప్రజలకు 52 రకాల వైద్య పరీక్షలిక ఉచితంగా చేయించుకోవచ్చు. అధికారికంగా ఈనెల 8న ప్రారంభం కానుంది. ఇటీవల తీసుకొచ్చిన రైతుబంధు, ఉచిత జీవిత బీమా వంటి పథకాలతో కేసీఆర్ తెలంగాణ రైతన్నలు, ప్రజల మనస్సులు దోచుకున్న సంగతి తెలిసిందే. నిరుపేదలకు అవసరమైన వైద్య పరీక్షల విషయంలో, వారిపై పడే అదనపు ఆర్థిక భారాన్ని తప్పించేందుకే ఈ పథకాన్ని తెస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.

ప్రయోగాత్మక దశలో హైదరాబాద్‌ పరిధిలోని 120 పట్టణ ఆరోగ్య కేంద్రాలకూ సేవలు అందుతాయని, ఆపై దశల వారీగా పాత జిల్లా కేంద్రాలన్నింటిలోనూ ల్యాబ్ లను ప్రారంభిస్తామని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్‌ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా.. రక్త, మల, మూత్ర పరీక్షలతో పాటు టైఫాయిడ్‌, డెంగీ, మలేరియా తదితర జ్వరాల నిర్ధారణకు, కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్‌ స్థాయిని తెలుసుకునే పరీక్షలు, బ్లడ్ కొలెస్ట్రాల్‌, రక్తంలో మూడు నెలల చక్కెర సరాసరి స్థాయి తదితర పరీక్షల ఫలితాలను అందిస్తారు. వీటితో పాటు 13 పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరికరాలు, నాలుగు ప్రాంతీయ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్‌ మెషీన్లు, జిల్లా ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ మెషీన్ ను కూడా టీ డయాగ్నొస్టిక్స్ పరిధిలోకి తీసుకొచ్చారు.
 

Similar News