దొరికిన దుర్గమ్మ చీర దొంగ

Update: 2018-08-07 09:42 GMT

రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన బెజవాడ దుర్గమ్మ చీర మాయం కేసు ఓ కొలిక్కి వచ్చింది. ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలు సూర్యలతే చీరను దొంగలించినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఆలయ ఈవో పద్మ నివేదికను సిద్ధం చేశారు. నివేదికను రూపొందించే క్రమంలో ఈవో పద్మ పోలీసులను కూడా సంప్రదించారు. సీసీ టీవీలో రికార్డ్‌ కాకపోయినా ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలు సూర్యలతే ఈ చర్యకు ఒడిగట్టినట్లు తేలింది. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేయడంతో ఆలయ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని.. అందుకే ఘటనకు కారణమైన సూర్యలతపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు ఈవో పద్మ చెబుతున్నారు. 

ఇంద్రకీలాద్రికి వివాదాలు కొత్తవేం కాదు మొన్నటికి మొన్న సంచలనం సృష్టించిన క్షుద్రపూజల వ్యవహారం మర్చిపోకముందే అమ్మవారి చీర మాయం కావడం తీవ్ర దుమారం రేపింది. అందరికీ అభయమిచ్చే అమ్మ సన్నిధిలోనే ఆమె చీరకే భద్రత కరువైంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆలయ ట్రస్ట్‌ విచారణను వేగవంతం చేశారు. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విషయంపై ఆరా తీశారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో పాలకమండలితో పాటు పోలీసుల విచారణలో బోర్డు సభ్యురాలు సూర్యలతే దొంగతనం చేసినట్లు తేలింది. 

Similar News