జోరుగా వజ్రాల వేట

Update: 2018-06-16 10:42 GMT

ఇక తొలకరి జల్లులు పలకరించడంతో  అనంతపురం జిల్లాలోనూ వజ్రాల వేట ప్రారంభమయ్యింది. వజ్రకరూర్ మండలంలోని పలు గ్రామాల్లో  స్ధానికులు పోలాలను జల్లెడ పడుతున్నారు. ఎక్కడైనా ఓ వజ్రం  దొరకకపోతుందా అంటూ ఆశగా అన్వేషణ సాగిస్తున్నారు. తొలకరి జల్లులు కురవగానే అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలు వేసేందుకు సిద్ధమవుతుంటే ... వజ్రకరూర్‌‌లో మాత్రం స్ధానికులు, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు పొలాల్లో తిష్టవేశారు. తెల్లవారుజాము నుంచి మసకమసక చీకటి పడే వరకు పోలాల్లోనే ఉంటూ రంగరాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. ముసలి, ముతక, ఆడ, మగా, చిన్నా, పెద్ద తేడా లేకుండా రోజుల తరబడి పొలాల్లోనే ఉంటూ వజ్రాల వేట సాగిస్తున్నారు. 

గతంలో ఇక్కడ ఎంతో మందికి వజ్రాలు  దొరికిన మాట వాస్తవమేనంటున్నారు స్ధానికులు. ఇంకో నెల రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో  వజ్రాలు దొరుకుతాయని నమ్మకంగా చెబుతున్నారు. ఒక వజ్రం దొరికితే తమ జీవితమే మారిపోతుందంటూ భవిష్యత్ ఊహించుకుంటున్నారు. ఇక వ్యాపారులు సైతం సమీప గ్రామాల్లో తిష్టవేసి తమ దగ్గరికి తెస్తున్న వజ్రాలకు ధరలు నిర్ణయిస్తున్నారు. బహిరంగానే ఇదంతా జరుగుతున్న అటు అధికారులు గాని ఇటు పోలీసులు గాని చూడట పోవడంతో వజ్రాలు, రంగురాళ్ల  వ్యాపారం జోరుగా సాగుతోంది.    

Similar News