కేంద్రానికి ఝలక్ ఇచ్చిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్...తొలి రోజునే కీలక నిర్ణయం

Update: 2018-08-11 05:23 GMT

 ఎన్డీయే అభ్యర్థిగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఓ ప్రైవేటు తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతినిచ్చి కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టేశారు. అయితే, ఆ సమయంలో విపక్ష సభ్యులు ఎక్కువమంది సభలో లేకపోవడంతో ప్రభుత్వం బయటపడగలిగింది.విషయమేంటంటే- ఒక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలుగా రిజర్వేషన్‌ ఉన్నవారు మిగిలిన రాష్ట్రాల్లో సైతం ఎస్సీ ఎస్టీలుగా ఆ సౌలభ్యం అనుభవించేట్లు రాజ్యాంగాన్ని సవరించాలని విశ్వంభర్‌ ప్రసాద్‌ నిషాద్‌ అనే సమాజ్‌వాదీ సభ్యుడు ఓ ప్రైవేటు తీర్మానం ప్రవేశపెట్టారు. ఇది అసాధ్యమని, ఒక కులాన్ని ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఓబీసీ అనే కేటగిరీల్లో చేర్చడానికి చాలా ప్రక్రియ జరుగుతుందని సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ తిరస్కరించారు.
 
అనంతరం దీనిపై ఓటింగ్‌ జరగాలని విపక్షాలు కోరగా ఉపాధ్యక్షుడు హరివంశ్‌సింగ్‌ అందుకు అనుమతి ఇచ్చారు. ఇది అన్యాయమని, ఓ ప్రైవేటు తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతివ్వడం అసాధారణమని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అభ్యంతరం చెప్పారు. కానీ హరివంశ్‌ వినలేదు. ఒకసారి తాను రూలింగిచ్చేశాక వెనక్కి తీసుకోనన్నారు. దాంతో ఆ తీర్మానాన్ని ఓడించడానికి ప్రభుత్వ విప్‌లు తమ పార్టీ సభ్యులను సభలోకి రప్పించడానికి పరుగులు పెట్టారు. చివరకు తీర్మానాన్ని 66-32 ఓట్ల తేడాతో సర్కారు ఓడించగల్గింది. విపక్ష సభ్యులు ఎక్కువమంది లేకపోవడం సర్కారుకు కలిసొచ్చింది.

Similar News