మరణంలోనూ వీడని భార్యభర్తల బంధం...భార్య చితి వద్దే ప్రాణాలు వదిలిన భర్త

Update: 2018-10-23 05:43 GMT

కలకాలం తోడుంటానని పెళ్లి మండపంలో ఏడడుగులు సాక్షిగా ఒక్కటైన ఆ దంపతులు మరణంలోనూ భార్యాభర్తల బంధాన్ని వీడలేదు. అనారోగ్యంతో భార్య మృతిచెందగా, ఆ బాధను తట్టుకోలేక శ్మశానవాటికలో భార్య చితి వద్దే ప్రాణాలు వదిలాడు భర్త. ఈ హృదయవిదాకర సంఘటన మెదక్‌‌లో జరిగింది. ఈ దంపతుల పేర్లు గోవింద్‌, సబిత. వీరు మెదక్‌ లోని ఫతేనగర్‌ బాలాజీ మఠం ఎదురుగా నివాసం ఉంటున్నారు. గోవింద్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి. గోవింద్ వయసు 75 ఏళ్లు, సబిత వయసు 65 ఏళ్లు. ఈ జంటకు పిల్లలు లేరు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సబిత ఇంట్లో మృతిచెందారు.

సబిత అంత్యక్రియలను మల్లెంచెరువు వద్ద శ్మశాన వాటిక వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భార్య దహన సంస్కరాలను భర్త గోవింద్ నిర్వహించాడు. సబిత చితికి నిప్పంటించేందుకు భర్తను కుటుంబ సభ్యులు సన్నద్ధం చేస్తున్న తరుణంలోనే ఒక్కసారిగా అతడు కుప్పకూలిపోయాడు. తీరా చూస్తే భర్త చనిపోయాడు. గంటల వ్యవధిలో సబిత, గోవింద్ దంపతులు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వెంటనే అప్పటికప్పుడు కట్టెలను తెప్పించి భార్య చితి పక్కనే భర్తను దహనం చేశారు. ఈ దంపతులకు సంతానం లేకపోవడంతో గోవింద్‌ అన్న కొడుకు ఈ భార్యాభర్తల చితికి నిప్పటించారు. 50 ఏళ్ల పాటు కలిసి జీవించిన సబిత, గోవింద్ దంపతులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారని, చివరికి చావులో కూడా ఒకటే అయ్యారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Similar News