ఏఐసీసీలో పదవుల భర్తీ షురూ...తెలంగాణ నేతల్లో ఉత్కంఠ

Update: 2018-04-17 06:24 GMT

ఏఐసీసీలో పదవుల భర్తీ తెలంగాణ నేతల్లో ఉత్కంఠ పెంచుతోంది, ఏపీ నుంచి ఇద్దరు నేతలకు జాతీయస్థాయి పదవులు వరించడంతో తెలంగాణలో ఎవరికి వస్తాయనే సస్పెన్స్ నెలకొంది. ఏపీలో ఊహించిన వారెవరికీ పోస్టులు రాకపోవడంతో తెలంగాణలో ఆ ఆశలు పెట్టుకున్నవారు టెన్షన్‌గా కాలం గడుపుతున్నారు.

ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ తనదైన శైలితో పని చేస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లుగా యువతకు, మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు. తాజాగా ఆంద్రప్రదేశ్ నుంచి మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలిని ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించారు. ఒరిస్సా కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలను కూడా వీరిద్దరికి అప్పగించారు. పక్క రాష్ట్రంలో ఏఐసీసీ పదవుల నియామకాలు ప్రారంభం అవ్వడంతో తెలంగాణలో కూడా రేపో మాపో పంపకాలు ఉంటాయని నేతలు ఎదురు చూస్తున్నారు. 

రాహుల్ ఎవరి ఊహలకు అందకుండా పదవులు ఇస్తుండం నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ఏపీలో ఎవరూ అంచనా వేయని విధంగా రుద్రరాజు, మస్తాన్ వలికి ఏఐసీసీ కార్యదర్శుల వంటి కీలక బాధ్యలు అప్పగించారు. తెలంగాణకు కూడా రెండు ఏఐసీసీ కార్యదర్శి పదవులు దక్కవచ్చని భావిస్తున్నారు. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా తెలంగాణకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కోటాలో వచ్చే జాతీయ స్థాయి పదవుల కోసం నేతలు ఇప్పటికే లాబింగ్ ప్రారంభించారు. మరి లాబీయింగ్ చేస్తున్న వారికి ఏఐసీసీ పదవులు దక్కుతాయా..లేదంటే తెలంగాణ నేతల ఎంపికలో కూడా రాహుల్ తన మార్క్ చూపిస్తారా అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఆ సస్పెన్స్ వీడాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు.
 

Similar News