ఆ ముగ్గురి వేధింపులకే శిల్ప బలి

Update: 2018-11-10 05:27 GMT

తిరుపతిలో సంచలనం సృష్టించిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు విచారణ ముగిసింది. శిల్ప ఆత్మహత్యకు ప్రొఫెసర్ల వేధింపులే కారణమని సీఐడీ తేల్చింది. ఈ మేరకు సీఐడీ అధికారులు నివేదికను సిద్ధం చేశారు. శిల్ప సోదరి శృతి ఫిర్యాదు ఆధారంగా 4 నెలల పాటు దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు మొత్తం 47 మందిని విచారించారు. ఆమె ఆత్మహత్యకు ప్రొఫెసర్ల వేధింపులే కారణమని తేల్చారు. దీంతో ముగ్గురు ప్రొఫెసర్లపై కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. 

ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల వల్లే డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు పాల్పడిందని సీఐడీ తేల్చింది. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన తన ఇంట్లో శిల్ప ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.ఈ ఆత్మహత్య ఘటనపై డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. విచారణను పూర్తి చేసిన సీఐడీ ముగ్గురు ప్రొఫెసర్లు ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్టు తేల్చింది.   

శిల్ప వైద్య కళాశాలలో చదువుతున్న సమయంలో చిన్నపిల్లల విభాగాధిపతి రవికుమార్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కిరీటి, శశికుమార్‌ తనను లైంగికంగా వేధిస్తున్నారని స్థానిక పోలీసులతో పాటు గవర్నర్‌కు శిల్ప ఫిర్యాదు చేశారు. శిల్ప ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్‌ కార్యాలయం విచారణ నిర్వహించాలని ఆదేశించడంతో ఎస్వీ వైద్య కళాశాల వీసీ విచారణ నిర్వహించారు. విచారణ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు వేధింపులు ఆగకపోవడంతో ఆమె కుంగిపోయినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. 

ఈ ఘటనకు సంబంధించి 47 మందిని విచారించిన సీఐడీ అధికారులు డిజిటల్‌ ఆధారాలు , సిట్‌ దర్యాప్తు బృందం, వివిధ కమిటీల రిపోర్టులను సేకరించారు. శిల్ప మైగ్రేన్‌తో తీవ్రంగా బాధపడుతూ ఉండేదని, ఈ క్రమంలోనే వైద్యుల లైంగిక వేధింపులు తోడవడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. శిల్ప మరణానికి భర్త, బంధువులకు ఎలాంటి సంబంధం లేదని అమ్మిరెడ్డి స్పష్టం చేశారు.  

మరోవైపు డాక్టర్ శిల్ప ఆత్మహత్యపై 90 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు సీఐడీ రిపోర్టుపై ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆలస్యమైందని, ఈ సీఐడీ రిపోర్టు ఆధారంగా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ కేసుకు సంబంధించి A-1గా రవికుమార్, A-2గా కిరిటీ, A-3గా శశికుమార్‌లను నిర్ధారించిన పోలీసులు వారిపై 
306, 354, 506, 309  సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. 

Similar News