సీఎంకు త‌ప్పిన ప్రమాదం

Update: 2018-02-02 05:48 GMT

మేడారం జాతరలో ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌ సింగ్‌కు ప్రమాదం తప్పింది. నిన్న రమణ్‌ సింగ్‌...సమ్మక్కను దర్శించుకుని సారలమ్మ వద్దకు వెళుతుండగా కొందరు భక్తులు కొబ్బరి కాయలు విసిరారు. వాటిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. చివరికి రమణ్ సింగ్ సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రమణ్‌ సింగ్‌‌కు సరైన ఏర్పాట్లు చేయలేదని విమర్శలు గుప్పించడం వివాదానికి దారి తీసింది. 

మేడారం జాతరకు వచ్చిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ‍్యమంత్రి రమణ్‌ సింగ్‌ సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. ఆయన నిన్న సమ్మక్కను దర్శించుకుని సారలమ్మ దగ్గరికి వెళ్తుండగా..క్యూలైన్‌లోని భక్తులు సమ్మక్క గద్దెపైకి కొబ్బరి కాయలు విసిరారు. అవి రమణ్‌ సింగ్‌ పక్కనుంచి వేగంగా వెళ్ళాయి. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆయనకు ముప్పు తప్పింది. 

సీఎం వస్తున్నా భక్తులను క్లియర్ చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కొబ్బరి కాయలు వేయకుండా భక్తులను ఎవరూ నియంత్రింవచలేకపోయారు. వేగంగా వస్తున్న కొబ్బరి కాయలు తగలకుండా సీఎం భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ రక్షణ కవచంలా నిలిచారు. పరిస్థితి అలానే ఉండడంతో రమణ్ సింగ్ కు హెల్మెట్ పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. చేసేది లేక రమణ్‌ సింగ్‌ సారలమ్మను దర్శించుకోకుండా తిరుగు ప్రయాణం అయ్యారు.

జరిగిన విషయం తెలుసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు...రమణ్ సింగ్ పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అమర్యాదగా ప్రవర్తించిందని విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రులు వివరణ ఇచ్చారు. ఎన్.ఎస్.జీ కమెండోలు స్థానిక పోలీసుల్ని సంప్రదించకుండా రమణ్ సింగ్ ను గద్దెల దగ్గరికి తీసుకెళ్లడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కడియం శ్రీహరి తెలిపారు. భక్తులు లక్షల సంఖ్యలో ఉండడంతో కొబ్బరికాయలు, బంగారం వేయడం సిఎంకు ఇబ్బంది కలిగించిందనీ అందుకే రమణ్ సింగ్ సారలమ్మ గద్దె దగ్గరికి వెళ్లకుండానే వెనుదిరిగారని  చెప్పారు. సిఎం కోసం ఏర్పాట్లు చేశామనీ. వాటిని ఛత్తీస్ గఢ్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే భక్తులను క్లియర్ చేయలేకపోయామని కడియం వివరించారు. బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా  ప్రభుత్వంపై నిందలు వేయడం తగదని ఉప ముఖ్యమంత్రి మండిపడ్డారు.

Similar News