కేసీఆర్‌ ఇప్పుడు అభ్యర్థి మాత్రమే: సీఈవో

Update: 2018-11-13 06:32 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. డిసెంబర్‌ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 19 వరకు నామినేషన్ల దాఖలుకు గుడువుంది. నోటిషికేషన్‌ జారీ కావడంతో నిబంధనలను ఎన్నికల సంఘం మరింత కఠినతరం చేసింది. అభ్యర్థులపై నిఘా పెంచడంతో పాటు మద్యం, డబ్బుల పంపిణీని అరికట్టేందుకు గట్టి చర్యలు చేపట్టింది. ఎన్నికల నియమ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్టు తెలంగాణ సీఈవో రజత్ కుమార్ ప్రకటించారు. ప్రచారం చేసే అభ్యర్ధులు ప్రతి రోజూ ఖర్చుల వివరాలు తెలియజేయాల్సిందేనన్నారు. ప్రతి అభ్యర్ధిపై నిఘా వేసినట్టు ఆయన తెలిపారు. వ్యక్తిగత దూషణలు, అధికార పదవుల్లో ఉన్న కుల సంఘాల సమావేశాలకు హజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.   

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఈసీ డేగ కన్ను వేసింది. అభ్యర్ధుల ఖర్చులను పైసాతో పాటు లెక్కించేలా ఏర్పాట్లు చేసింది. వివిధ పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే  ప్రజల నుంచి వస్తున్న వినతులపై తక్షణ ఆదేశాలు జారీ చేస్తున్నారు. నోటిఫికేషన్ వెలుబడిన సందర్భంగా సీఈవో రజత్ కుమార్ మరోసారి ఈసీ నిబంధనలను వివరించారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసిన ఆయన పోటీ చేసే అభ్యర్ధులు వ్యక్తిగత విమర్శలు చేస్తే నోటీసులు తప్పవంటూ హెచ్చరించారు. మంత్రులు కులసంఘాల సమావేశాలకు హజరైతే వివరణ కోరుతామన్నారు. కులాల పేరుతో  ఓట్లు అడిగినా , ప్రచారం నిర్వహించినా కోడ్ ఆఫ్ కండెక్ట్ కింద చర్యలు తప్పవన్నారు. 

ఈ నెల 19 వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని సీఈవో రజత్‌కుమార్‌ తెలిపారు. అఫిడవిట్‌లో ఖాళీలు ఉన్నంత మాత్రాన నామినేషన్లను తిరస్కరించడానికి వీల్లేదన్నారు. ఆర్వో సాయంతో ఖాళీలు పూరించవచ్చన్నారు. దీనిపై ఆర్వోలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్టు రజత్‌కుమార్‌ తెలిపారు. ఆపద్ధర్మ సీఎంగా ఉన్న కేసీఆర్  ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్ధి మాత్రమేనని ఆయనపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా అందరిలాగే విచారిస్తామన్నారు.  ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో లక్షా 16 వేల ఓటర్లను తొలగించినట్టు రజత్‌కుమార్‌ తెలిపారు.  

Similar News