'నాడు జగన్ ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది?' అన్న ప్రశ్నకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సమాధానం

Update: 2018-05-28 08:35 GMT

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రస్తుత వైకాపా అధినేత, అప్పటి కాంగ్రెస్ ఎంపీ వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన నాటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, తాజాగా, ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న వేళ జగన్ కేసుల ప్రస్తావన రాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నిబంధనల ప్రకారం వ్యవహరించి, పై అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశామని, ఆపై 24 గంటల వ్యవధిలోనే కోర్టు ముందు హాజరు పరిచామని, కోర్టు తమ చర్యలను రివ్యూ చేసి, అవి సరైనవేనని నిర్ధారించిందని స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు.

 ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తాను 2006లోనే హైదరాబాద్ సీబీఐ ఆఫీసుకి బదిలీపై వచ్చానని, ఆపై 5 సంవత్సరాల తరువాత 2011లో కేసు తన ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ కేసు కోసం తానేమీ నియమించబడలేదని, జగన్ ను అరెస్ట్ చేయాలని తనపై ఎటువంటి రాజకీయ ఒత్తిడులూ రాలేదని చెప్పారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగానే విచారణ జరిపామని, ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదని, అప్పటి సీబీఐ బాస్ ల నుంచి తనపై ఒత్తిడి వచ్చిందనడం అసత్యమని స్పష్టం చేశారు. 

Similar News