ఆళ్లగడ్డ టీడీపీలో ముదిరిన విభేదాలు..

Update: 2018-03-30 06:31 GMT

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నివురు గప్పిన నిప్పులా ఉన్న టీడీపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంత్రి అఖిలప్రియ, ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇద్దరూ  బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సుబ్బారెడ్డి నిర్వహించే కార్యక్రమానికి వెళ్లొద్దని అఖిలప్రియ పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించడం విభేదాలకు ఆజ్యం పోసింది. దీంతో ఆళ్ళగడ్డ టీడీపీలో ఏం జరుగుతోందోననే ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆళ్లగడ్డ టీడీపీ కోట బీటలు వారుతోంది. భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిలప్రియ మధ్య వర్గ విభేదాలు ఇప్పుడు రోడ్డునపడ్డాయి. భూమా మరణం తర్వాత అఖిలప్రియ, ఇతర కుటుంబ సభ్యులు సుబ్బారెడ్డిని దూరం పెడుతూ వచ్చారు. నంద్యాల ఉపఎన్నికల సమయంలో మంత్రి, సుబ్బారెడ్డి మధ్య సీఎం చంద్రబాబు రాజీ కుదిర్చారు.

ఆళ్ళగడ్డలో తన పట్టు చాటేందుకు ఏవీ సుబ్బారెడ్డి ఏవీ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్‌లైన్ ప్రారంభ కార్యక్రమానికి వెళ్ళకూడదని మంత్రి అఖిలప్రియ తన అనుచరులకు సూచించారని సమాచారం. ఏవీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మంత్రి టీడీపీ కార్యకర్తలను ఆదేశించారని అంటున్నారు. భూమా వర్ధంతి సభలో అఖిలప్రియ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కొన్ని దుష్టశక్తులు తన తండ్రి చావుకు కారణమయ్యాయని, ఆ గుంట నక్కలన్నీ ఆళ్లగడ్డని పీక్కుతినడానికి ఒక్కటయ్యాయని పరోక్షంగా ఏవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేశారు. 

భూమా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి సభలో అఖిలప్రియ తనను ఉద్దేశించి గుంటనక్క అంటూ మాట్లాడారని సుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే ఆళ్లగడ్డలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తన పోరాటం అఖిలప్రియతోనే అని ఆయన తేల్చిచెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సుబ్బారెడ్డి, అఖిలప్రియ మధ్య పెరుగుతున్న గ్యాప్‌ను తగ్గించకపోతే టీడీపీ నష్టపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News