మరో పోరాటానికి తెరతీసిన టీడీపీ

Update: 2018-04-06 09:23 GMT

తెలుగు ప్రజలతో పెట్టుకుంటే ఖబడ్దార్ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీని బలహీన పరచడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని బాబు ఆరోపించారు. బీజేపీ ప్రయత్నాలు ఎప్పటికి సఫలం కావన్ని ప్రధాని మోడీకి పరోక్షంగా సైకిల్ తొక్కి వార్నింగ్ ఇచ్చారు. విభజన ద్వారా ఏపీకి తీవ్రనష్టం కలిగించిన కాంగ్రెస్‌ పార్టీ నేడు రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయిందని గుర్తు చేశారు. బీజేపీకి అదే పరిస్థితి తప్పదని హెచ్చరించారు. 

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్రం అమలు చేయకపోవడంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ.. అవిశ్వాసం ప్రవేశపెట్టడం, పార్లమెంటులో ఆందోళనలు చేపట్టడం జరిగింది. తాజాగా సైకిల్ యాత్ర పేరుతో మరో పోరాటానికి తెరతీసింది. ఇందులో భాగంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో సైకిల్, మోటార్ సైకిల్ యాత్రలను చేపట్టింది. రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి సైకిల్ యాత్రను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు తెలుగు వారిని దెబ్బతీయాలని చూస్తే ఖబడ్డార్ అంటూ ప్రధాని మోడీని హెచ్చరించారు. తెలుగువారితో పెట్టుకుంటే ఎవరికైనా పరాభవం తప్పదని నాడు ఎన్టీఆర్‌ను గద్దె దించాలని ప్రయత్నించిన ఇందిరాగాంధీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఓ యువతి రాజధాని నిర్మాణం కోసం 5లక్షల విరాళాన్ని చంద్రబాబుకు అందజేశారు. ఆ యువతిని అభినందించిన సీఎం రాజధాని నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటంలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.

మొత్తం మీద ఈ సైకిల్ యాత్ర ద్వారా...రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై పోరాటాన్ని ఉద్ధృతం చేసినట్లు ప్రకటించారు చంద్రబాబు. అయితే, బాబుగారి సైకిల్ యాత్రతో సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు ఆయన వెంట పరుగెత్తలేక పాట్లు పడాల్సి వచ్చింది. 

Similar News