15 రూపాయలకే 3 పూటలా ఆహారం...రూ. 73 ఖరీదైన ఆహారం రూ. 15 కే అందచేత

Update: 2018-07-11 12:45 GMT

పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించే అన్న క్యాంటీన్లు ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రారంభమయ్యాయి.మూడుపూటలా కలిపి 73 రూపాయలు ఖర్చయ్యే ఆహారాన్ని ప్రభుత్వం 15 రూపాయలకే అందిస్తోంది. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 60 క్యాంటీన్లకు శ్రీకారం చుట్టారు. చౌక ధరలకే భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. విజయవాడ భవానీపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్‌‌ పథకానికి శ్రీకారం చుట్టారు. తర్వాత అక్కడి మహిళలతో కలిసి సీఎం భోజనం చేశారు. 

రాష్ట్ర వ్యాస్తంగా తొలి విడతలో 25 మున్సిపాలిటీల్లో 60 క్యాంటీన్లను ప్రారంభించారు. అన్న క్యాంటీన్ల ద్వారా 15 రూపాయలకే మూడు పూటలా ఆహారం అందిస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడతారు. క్యాటరింగ్‌ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. ప్రతి క్యాంటీన్‌లో రోజుకు 250 నుంచి 300 మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేశారు. అందరూ కడుపునిండా తినాలనే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్లను ప్రారంభించామని చంద్రబాబు నాయుడు అన్నారు. పేదలు, వృద్ధులకు అన్న క్యాంటీన్లు ఒక వరమన్నారు. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీపడకుండా ఆహారం అందిస్తామని చెప్పారు. క్యాంటీన్ల నిర్వహణపై ప్రజాప్రాయసేకరణ చేస్తామని తెలిపారు. వచ్చే ఆగస్టు 15నాటికి 203 అన్న క్యాంటీన్ల నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. 203 క్యాంటీన్ల ద్వారా రెండున్నర లక్షల మందికి అల్పాహారం, భోజనం అందిస్తారు. దాతలు ముందుకు వస్తే విరాళాలు స్వీకరిస్తారు.

Similar News