సంచలన నిర్ణయం తీసుకున్న ఆప్‌ ప్రభుత్వం

Update: 2018-11-27 07:01 GMT

గతవారం ఢిల్లీ సచివాలయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కారం పొడితో దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి బీజేపీ, ఢిల్లీ పోలీసులే కారణమని ఆప్‌ నాయకులు ఆరోపిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించింది. ఇందుకోసం అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌​ చేసింది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఢిల్లీ పోలీసులు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉండాలని ఆ తీర్మానంలో పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా హోం మంత్రి సత్యేంద్ర జైన్‌ ఈ తీర్మానాన్ని సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ‘ఢిల్లీ పోలీసులను ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. దీని ద్వారా జవాబుదారీతనం పెరుగుతుంది. ఢిల్లీలో ప్రజలకు భద్రత లేకుండా పోయింది’ అని అన్నారు. తమ నాయకులపై బీజేపీ నేతలు కక్ష్యగట్టి దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Similar News