Budget 2026 : హల్వా వేడుక అంటే ఏమిటి? అధికారుల గృహనిర్బంధం వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా ?

హల్వా వేడుక అంటే ఏమిటి? అధికారుల గృహనిర్బంధం వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా ?

Update: 2026-01-28 02:27 GMT

Budget 2026 : ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఘట్టం కేంద్ర బడ్జెట్. అయితే ఈ బడ్జెట్ పార్లమెంటుకు చేరడానికి ముందు ఆర్థిక శాఖలో ఒక ఆసక్తికరమైన, సంప్రదాయబద్ధమైన వేడుక జరుగుతుంది. అదే హల్వా సెర్మనీ. ఈ వేడుక ముగియగానే బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే అధికారులు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా లాక్ అయిపోతారు. అసలు ఈ హల్వా వేడుక వెనుక ఉన్న రహస్యమేంటి? అధికారులను ఎందుకు నిర్బంధిస్తారు? అన్న ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

కేంద్ర బడ్జెట్ తయారీ అనేది అత్యంత గోప్యంగా జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని చెప్పడానికి గుర్తుగా హల్వా వేడుక నిర్వహిస్తారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఒక పెద్ద కడాయిలో హల్వా వండి, దానిని ఆర్థిక మంత్రి స్వయంగా చవిచూసి అధికారులకు వడ్డిస్తారు. ఏదైనా శుభకార్యం చేసే ముందు నోరు తీపి చేసుకోవడం మన భారతీయ సంప్రదాయం. అందుకే బడ్జెట్ ముద్రణ ప్రారంభించే ముందు ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ వేడుక ముగిసిన వెంటనే బడ్జెట్ తయారీలో పాలుపంచుకునే వందలాది మంది సిబ్బంది ఒక ప్రత్యేకమైన లాక్-ఇన్ పీరియడ్‎లోకి వెళతారు.

ఏమిటీ లాక్-ఇన్ పీరియడ్ ?

బడ్జెట్ అనేది దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే పత్రం. ఇందులో ఉండే అంశాలు ముందుగానే లీక్ అయితే స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం లేదా అక్రమ వ్యాపారాలు పెరగడం వంటి ముప్పులు ఉంటాయి. అందుకే, హల్వా వేడుక ముగిసిన క్షణం నుండి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని పార్లమెంటులో ముగించే వరకు (సుమారు 10 రోజులు) అధికారులను ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచుతారు. ఈ కాలంలో వారు తమ కుటుంబ సభ్యులను కూడా కలవడానికి వీల్లేదు. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ల్యాండ్ లైన్ ద్వారా అది కూడా నిఘా నీడలో మాట్లాడవచ్చు. ఈ అధికారులకు భోజనం, వసతి అన్నీ నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లోనే ఏర్పాటు చేస్తారు.

అసలు ఈ కఠిన నిబంధనలు ఎందుకు వచ్చాయి?

ఈ రహస్య పద్ధతి వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. 1950 సంవత్సరానికి ముందు బడ్జెట్ వివరాలు రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. అయితే ఆ ఏడాది బడ్జెట్ పత్రాలు లీక్ అయ్యాయి. ఇది పెద్ద దుమారాన్నే రేపింది. అప్పటి నుంచి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ తర్వాత ముద్రణను మింటో రోడ్ ప్రెస్‌కు మార్చారు. చివరకు 1980 నుంచి నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లోనే ఒక ప్రత్యేక ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశం ఎంత భద్రంగా ఉంటుందంటే, అక్కడ నిరంతరం ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కాపలా ఉంటారు. ఇంటర్నెట్ జామింగ్ వ్యవస్థలు కూడా పనిచేస్తుంటాయి.

డిజిటల్ యుగంలోనూ అదే పద్ధతి

ప్రస్తుతం బడ్జెట్ పత్రాలను భౌతికంగా ముద్రించడం తగ్గించి, డిజిటల్ రూపంలో ప్రవేశపెడుతున్నారు. అయినప్పటికీ ఈ గోప్యతలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అధికారులు కంప్యూటర్లలో డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు కూడా బయటి నెట్‌వర్క్ దానికి కనెక్ట్ కాకుండా చూస్తారు. కేవలం బడ్జెట్ ప్రసంగం ముగిశాక, ఆర్థిక మంత్రి అనుమతితోనే ఈ అధికారులను బయటికి పంపిస్తారు. ఈ ఆచారం బ్రిటీష్ కాలం నుండి వస్తున్నప్పటికీ, ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలో ఒక పవిత్రమైన సంప్రదాయంగా కొనసాగుతోంది.

Tags:    

Similar News