Deepinder Goyal: 10 నిమిషాల డెలివరీ వెనకున్న సీక్రెట్ ఇదే.. జొమాటో సీఈవో ఇంట్రెస్టింగ్ ట్వీట్..!!
Deepinder Goyal: 10 నిమిషాల డెలివరీ వెనకున్న సీక్రెట్ ఇదే.. జొమాటో సీఈవో ఇంట్రెస్టింగ్ ట్వీట్..!!
Deepinder Goyal: జొమాటో, బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫాంలు అందిస్తున్న 10 నిమిషాల డెలివరీ ఎలా సాధ్యమవుతోందన్న అంశంపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. ఈ వేగం వెనుక డెలివరీ ఏజెంట్లు అతి వేగంగా వాహనాలు నడుపుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే.. ఈ సందేహాలకు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ స్పష్టమైన వివరణ ఇచ్చారు.
డెలివరీ వేగానికి కారణం రైడర్లు వేగంగా వెళ్లడమో, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమో కాదని ఆయన తేల్చిచెప్పారు. అసలు రహస్యం ఏమిటంటే… కస్టమర్లకు అత్యంత సమీప ప్రాంతాల్లో విస్తృతంగా ఏర్పాటు చేసిన ‘డార్క్ స్టోర్ల’ నెట్‌వర్క్. ఈ స్టోర్లు నగరాల్లో దట్టంగా ఉండటంతో, ఆర్డర్ వచ్చిన వెంటనే తక్కువ దూరంలోనే సరుకులు అందించడం సాధ్యమవుతోందని గోయల్ వివరించారు.
ఒక ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత, స్టోర్‌లో ప్యాకింగ్‌కు సగటున రెండున్నర నిమిషాలు మాత్రమే పడుతుందన్నారు. ఆ తర్వాత డెలివరీ దూరం సాధారణంగా 2 కిలోమీటర్ల లోపే ఉంటుందని చెప్పారు. ఇలాంటి దూరాన్ని గంటకు కేవలం 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా, సులభంగా 7–8 నిమిషాల్లో చేరవచ్చని ఆయన వివరించారు. అందువల్ల డెలివరీ పార్ట్‌నర్లపై వేగంగా వెళ్లాలన్న ఒత్తిడి అసలు ఉండదని స్పష్టం చేశారు.
అలాగే, ఆలస్యమైన డెలివరీలపై తమ సంస్థ ఎలాంటి జరిమానాలు విధించదని, సమయానికి ముందే చేరితే ప్రత్యేక బోనస్‌లు కూడా ఉండవని గోయల్ పేర్కొన్నారు. దీనివల్ల డెలివరీ పార్ట్‌నర్లు సురక్షితంగా, ఒత్తిడి లేకుండా పని చేయగలుగుతున్నారని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ, ఇది కేవలం డెలివరీ పార్ట్‌నర్ల సమస్య కాదని, మన సమాజంలో చాలామందికి తొందర ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. యూనిఫాంలో ఉండటం వల్ల తమ డెలివరీ ఏజెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, గిగ్ వర్కర్ల నిరసనల మధ్య కూడా న్యూ ఇయర్ రోజున జొమాటో, బ్లింకిట్ కలిసి రికార్డు స్థాయిలో 75 లక్షల ఆర్డర్లను విజయవంతంగా డెలివరీ చేసినట్లు గోయల్ వెల్లడించారు. ఇది వారి డెలివరీ మోడల్ ఎంత బలంగా పనిచేస్తోందో స్పష్టంగా చూపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.