Silver Price : వెండి రికార్డ్ బ్రేక్.. తొలిసారి కేజీ రూ.4 లక్షలు..బంగారం కూడా భారీగా జంప్

వెండి రికార్డ్ బ్రేక్.. తొలిసారి కేజీ రూ.4 లక్షలు..బంగారం కూడా భారీగా జంప్

Update: 2026-01-28 05:13 GMT

Silver Price : బులియన్ మార్కెట్‌లో మంటలు చెలరేగుతున్నాయి. బంగారం, వెండి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. బుధవారం (జనవరి 28, 2026) హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర ఏకంగా రూ.4 లక్షల మార్కును తాకి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే వెండి కేజీకి రూ.13,000 పెరగడం విశేషం. పసిడి కూడా ఏమాత్రం తగ్గకుండా భారీగా ఎగబాకి కొనుగోలుదారులకు షాకిచ్చింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ధరల పెరుగుదల చూస్తుంటే భయం వేస్తోంది. మంగళవారం వరకు ఒకలా ఉన్న ధరలు, బుధవారం నాటికి ఒక్కసారిగా రెక్కలు కట్టుకుని ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కెనడాపై 100 శాతం టారిఫ్స్ విధిస్తానన్న ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకాయి.

గోల్డ్ కంటే వెండి ఈసారి ఊహించని రీతిలో పెరిగింది. కేవలం ఈ నెల (జనవరి 1, 2026) ప్రారంభంలో రూ.2.56 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి ధర, కేవలం 28 రోజుల్లోనే రూ.4,00,000కు చేరింది. అంటే దాదాపు 56 శాతం పెరిగింది. బుధవారం ఒక్కరోజే కేజీకి రూ.13,000 అదనంగా పెరగడం బులియన్ చరిత్రలోనే అరుదైన విషయం. పారిశ్రామికంగా, ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ రంగాలో వెండి వినియోగం పెరగడం కూడా ఈ భారీ ర్యాలీకి ఊతమిచ్చింది.

అటు పసిడి కూడా సరికొత్త రికార్డులను తిరగరాసింది. 24 క్యారెట్ల (స్వచ్ఛమైన) 10 గ్రాముల బంగారం ధర రూ.3,220 పెరిగి రూ.1,65,170కి చేరింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,950 ఎగబాకి రూ.1,51,400 వద్ద స్థిరపడింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు కొనసాగుతుండగా, మారుమూల ప్రాంతాల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ రేట్ల పెరుగుదల సామాన్య ప్రజలను కలవరపెడుతోంది. పసిడి ప్రియులు ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్నా, పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గేవరకు ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే వెండి ధర మరిన్ని శిఖరాలను అధిరోహించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags:    

Similar News