RBI MPC Meeting: నేటితో ముగియనున్న ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్.. రెపో రేటు భారీగా తగ్గుతుందా?
RBI MPC Meeting: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముగింపు దశకు చేరుకుంది.
RBI MPC Meeting: నేటితో ముగియనున్న ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్.. రెపో రేటు భారీగా తగ్గుతుందా?
RBI MPC Meeting: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముగింపు దశకు చేరుకుంది. నేడు అంటే శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ కీలక సమావేశం నిర్ణయాలను ప్రకటించనున్నారు. ఆర్థిక నిపుణులు రెపో రేటు గణనీయంగా తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపనుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం బుధవారం ప్రారంభమైంది. నేడు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ సమావేశం నిర్ణయాలను ప్రకటించనున్నారు. వివిధ నిపుణుల అంచనాల ప్రకారం.. రెపో రేటును 25 నుండి 75 బేసిస్ పాయింట్ల (bps) వరకు తగ్గించే అవకాశం ఉంది.
ప్రస్తుతం రెపో రేటు 6శాతం వద్ద ఉంది. నేడు దీనిని తగ్గించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఎంత తగ్గించాలనేది ప్రశ్న. కనీసం 25 బేసిస్ పాయింట్ల రేటు కోతకు ఆర్‌బీఐ మొగ్గు చూపవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, చాలా మంది నిపుణులు 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు కోత సాధ్యమని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు 75 బేసిస్ పాయింట్ల వరకు రేటును తగ్గించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.
ఎస్‌బీఐ రీసెర్చ్ ఆర్థికవేత్తలు: రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని అంచనా వేశారు. ఇది జరిగితే, ప్రస్తుత 6శాతం రెపో రేటు 5.50శాతానికి తగ్గుతుంది.
మోర్గాన్ స్టాన్లీ సంస్థ: ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 100 బేసిస్ పాయింట్ల రెపో రేటు కోత ఉండే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ నెలలో (ఈసారి) 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని, ఆ తర్వాత ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కూడా తలా 25 బేసిస్ పాయింట్ల చొప్పున రేటు కోత ఉండవచ్చని తెలిపింది.
పెద్ద కోతకు ఇదే సరైన సమయం!
భారతదేశంలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం (inflation) పూర్తిగా నియంత్రణలో ఉంది. మరోవైపు, జీడీపీ వృద్ధి రేటు మందగించింది. ఆర్థిక వ్యవస్థకు ఊపునివ్వడానికి వడ్డీ రేట్ల తగ్గింపు చాలా ముఖ్యం. రెపో రేటు తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఇది వినియోగాన్ని పెంచుతుంది. తద్వారా జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది. గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడానికి కూడా ఇది దారితీస్తుంది. ఇది వినియోగదారులకు, వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.