Repo Rate: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. 56 నెలల తర్వాత రెపో రేటు తగ్గింపు!
Repo Rate: దేశంలోని కోట్లాది హోం లోన్ వినియోగదారులకు గొప్ప శుభవార్త అందించింది రిజర్వ్ బ్యాంక్. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) కీలక నిర్ణయం తీసుకుని రెపో రేటును 0.25 శాతం తగ్గించింది.
Repo Rate: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. 56 నెలల తర్వాత రెపో రేటు తగ్గింపు!
Repo Rate: దేశంలోని కోట్లాది హోం లోన్ వినియోగదారులకు గొప్ప శుభవార్త అందించింది రిజర్వ్ బ్యాంక్. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) కీలక నిర్ణయం తీసుకుని రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. దీని వల్ల రెపో రేటు 6.50 శాతం నుండి 6.25 శాతానికి తగ్గింది. 56 నెలల తర్వాత, అంటే 2020 మే తర్వాత తొలిసారి రెపో రేటు తగ్గింపు జరిగింది. గత రెండేళ్లుగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
హోం లోన్ ఈఎంఐ తగ్గే అవకాశం
రెపో రేటు తగ్గింపుతో హోం లోన్ తీసుకున్నవారికి పెద్ద ఊరట లభించనుంది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బ్యాంకులు కూడా రుణ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దీంతో హోం లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ ఈఎంఐలు తగ్గే అవకాశముంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 12 లక్షల వార్షిక ఆదాయాన్ని పన్ను మినహాయింపు పరిధిలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు మరో శుభవార్తగా మారింది.
రెండు సంవత్సరాలుగా ఫ్రీజ్ అయిన వడ్డీ రేట్లు
ఫిబ్రవరి 2023 నుండి ఇప్పటివరకు ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది. అంతకుముందు మే 2022 నుండి వడ్డీ రేట్లను 2.50 శాతం పెంచుతూ వచ్చింది. అప్పట్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కానీ ప్రస్తుతం దేశంలోని రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం స్థాయికి చేరుకుంది. ఇది 4 శాతానికి తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఆర్బీఐ కొత్త గవర్నర్ కీలక నిర్ణయం
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవి ముగిసిన తర్వాత కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వడ్డీ రేట్లను తగ్గించాలని గత కొన్ని నెలలుగా కేంద్రం ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. మల్హోత్రా ఈ నిర్ణయంతో ఆర్థిక వృద్ధికి సహాయపడే దిశగా ముందడుగు వేశారు.
ఇంకా వడ్డీ రేట్లు తగ్గేనా?
ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం.. రాబోయే మానిటరీ పాలసీ సమీక్షల్లో కూడా వడ్డీ రేట్లు మరింత తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల రుణ గ్రహీతలకు మరింత లాభం కలుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తగ్గింపుతో మీ హోం లోన్ EMIలో ఎంత తగ్గుదల వస్తుందో త్వరలో బ్యాంకుల చేసే ప్రకటనల ద్వారానే స్పష్టత రానుంది.