Shantanu naidu: రతన్ టాటా ఫ్రెండ్ శంతనుకు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలు

దివంగత రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు టాటా మోటార్స్‌లో కీలక పదవి లభించింది. టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్‌కు జనరల్ మేనేజర్‌గా శంతను నియమితులయ్యారు.

Update: 2025-02-04 13:03 GMT

 రతన్ టాటా ఫ్రెండ్ శంతనుకు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలు

Shantanu naidu: దివంగత రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు టాటా మోటార్స్‌లో కీలక పదవి లభించింది. టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్‌కు జనరల్ మేనేజర్‌గా శంతను నియమితులయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శంతను లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు. టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెలుపు రంగు చొక్కా, నేవీ బ్లూ ప్యాంట్‌లో తన తండ్రి నడుచుకుంటూ ఇంటికి వచ్చేవారని.. ఆ సమయంలో తాను ఆయన కోసం ఎదురు చూస్తూ కిటికీలో నుంచి చూసేవాడినని శంతను చెప్పారు. ఇప్పుడు తాను కూడా అలా నడిచొచ్చే రోజులు వచ్చాయని రాసుకొచ్చారు.

టాటా ట్రస్ట్‌లో చిన్న వాడైన శంతను 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో 80ల్లో ఉన్న టాటాకు.. ఆ యువకుడికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఏర్పడడానికి కారణం వీధి శునకాలే. వీరిద్దరికి వాటిపై ఉన్న ప్రేమే వారిద్దరి మధ్య బంధం బలపడేలా చేసింది. దీంతో టాటాకు జనరల్ మేనేజర్‌గా అత్యంత నమ్మకస్తుడిగా మారాడు శంతను.

రతన్ టాటా, శంతను మధ్య వయస్సు తేడా ఉన్నా.. అది వారి స్నేహానికి, వ్యాపారానికి ఏ మాత్రం అడ్డుకాలేదు. ఒకరిపై మరొకరు చేతులు వేసుకుని మాట్లాడేంత సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరి బంధాన్ని అర్థం చేసుకున్నవారు ఏజ్ జస్ట్ ఏ నంబర్ అని అనేవారు. వయస్సులో చిన్నవాడే అయినా ఆలోచనా ధోరణిలో మాత్రం శంతను పెద్దవాడే అంటూ స్వయంగా రతన్ టాటానే కాంప్లిమెంట్ ఇచ్చారు. కరోనా కాలంలో ఎన్నో సహాయక కార్యక్రమాలు నిర్వహించారు రతన్ టాటా.. ఆ పనులను దగ్గరుండి శంతను పర్యవేక్షించారు.

గత ఏడాది అక్టోబరులో రతన్ టాటా తుదిశ్వాస విడిచిన సమయంలో శంతను గురించి బాగా చర్చ జరిగింది. ఒకరకంగా అప్పుడే అతని గురించి అందరికీ తెలిసిందని చెప్పాలి. రతన్ టాటా చనిపోయిన సమయంలో శంతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన మార్గదర్శిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మీ నిష్క్రమణతో మన స్నేహంలో శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవడంతో కలిగిన దు:ఖం పూడ్చలేనిది. గుడ్ బై మై డియర్ లైట్ హౌస్ అంటూ శంతను ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News